V6 News

డీలిమిటేషన్పై 131వ రాజ్యాంగ సవరణ బిల్లును.. లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్రం

డీలిమిటేషన్పై 131వ రాజ్యాంగ సవరణ బిల్లును.. లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్రం

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌‌‌‌ రామ్​మేఘవాల్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును కాంగ్రెస్, సమాజ్ వాదీ, తృణముల్ కాంగ్రెస్, కేరళకు చెందిన RSP పార్టీలు వ్యతిరేకించాయి. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌‌‌‌), మహిళా రిజర్వేషన్ బిల్లులకు కేంద్రం సిద్ధమైన సంగతి తెలిసిందే.

డీలిమిటేషన్‌‌‌‌ బిల్లు ఆమోదం పొందితే.. ఇది 131వ రాజ్యాంగ సవరణ చట్టం అవుతుంది. అందుకు సంబంధించి ఆర్టికల్ 55, 81 కింద సవరణ సర్క్యులర్‌‌‌‌‌‌‌‌ను కేంద్రం మంగళవారం జారీ చేసింది. ఈ చట్టం ప్రకారమే లోక్‌‌‌‌సభ, రాష్ట్ర అసెంబ్లీల సీట్లను పునర్విభజన చేయనున్నారు. ఆ ప్రకారం ఎంపీ సీట్ల సంఖ్య 850 వరకు పెరిగే అవకాశం ఉంది.

కేంద్ర పాలిత ప్రాంతాల ఎంపీ సీట్లు 35కు మించకుండా ఉండాలని ఈ చట్టంలో ప్రతిపాదించనున్నారు. 2029 సాధారణ ఎన్నికల సమయం నుంచి మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా.. కేంద్రం మూడు ముఖ్యమైన బిల్లులను గురువారం లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది.

కేంద్ర హోం అమిత్‌ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే  పాత డీలిమిటేషన్ చట్టం –2002 రద్దవుతుంది. పెరిగిన జనాభా, వలసలు, నియోజకవర్గాల మధ్య జనాభా వ్యత్యాసాలను సరిచేయడానికి, అలాగే మహిళలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి ఈ కొత్త చట్టం అవసరమని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది.

ఈ బిల్లులో అత్యంత కీలకమైన అంశం మహిళా రిజర్వేషన్. లోక్‌‌‌‌సభ, రాష్ట్రాల శాసనసభలలో మహిళలకు మూడింట ఒక వంతు (33%) సీట్లను కేటాయించనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన స్థానాల్లో కూడా మహిళలకు అంతర్గత రిజర్వేషన్లు వర్తిస్తాయి. మహిళలకు  ప్రతి ఎన్నికల్లో వేర్వేరు నియోజకవర్గాలకు మారుస్తూ  రొటేషన్ పద్ధతిలో సీట్లను కేటాయిస్తారు. తాజా జనాభా లెక్కల  ఆధారంగా రాష్ట్రాలకు కేటాయించే సీట్ల సంఖ్యలో మార్పులు జరుగుతాయి. 

నియోజకవర్గాల విభజన సమయంలో భౌగోళిక సామీప్యత, పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుంటారు. మహిళల ప్రాతినిథ్యాన్ని ప్రజాస్వామ్యంలో మరింత వేగవంతం చేయడం కోసమే ఈ చర్యలు చేపట్టినట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలతో సహా అందరికీ 33 శాతం  రిజర్వేషన్లు కల్పించడమే ఈ బిల్లు ధ్యేయమని వెల్లడించింది.