V6 News

రోజు వారీ కూలీల్లో 45 శాతం మంది ఎస్సీలు, 10 శాతం మంది అగ్రవర్ణాలు

రోజు వారీ కూలీల్లో 45 శాతం మంది ఎస్సీలు, 10 శాతం మంది అగ్రవర్ణాలు

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు అగ్రవర్ణాల కంటే మూడు రెట్లు ఎక్కువ వెనుకబడి ఉన్నారని నివేదిక వెల్లడించింది. బీసీలు కూడా అగ్రవర్ణాల కంటే 2.7 రెట్లు వెనుకబడి ఉన్నారు. మొత్తం 242 కులాల్లో 135 కులాలను ‘అత్యంత వెనుకబడినవి’గా గుర్తించారు. ఈ 135 కులాల్లోనే రాష్ట్ర జనాభాలో 67 శాతం మంది ఉన్నారు. ఈ కులాలు రాష్ట్ర సగటు కంటే ఎక్కువ వెనుకబడి ఉండటం గమనార్హం. 

ముఖ్యంగా ఎస్టీల్లో 99 శాతం, ఎస్సీల్లో 97 శాతం, బీసీల్లో 71 శాతం మంది ప్రజలు రాష్ట్ర సగటు కంటే వెనుకబడి ఉండటం ఆందోళన కలిగించే అంశం. మరోవైపు, అగ్రవర్ణాలకు చెందిన 18 కులాలూ రాష్ట్ర సగటు కంటే మెరుగైన స్థితిలోనే ఉన్నాయని సీబీఐ ర్యాంకింగ్స్ స్పష్టం చేశాయి. 2024లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాల్లో ఈ విషయం స్పష్టం చేసింది. దీనిపై స్టడీ చేసిన నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

  • దినసరి కూలీలుగానే అట్టడుగు వర్గాలు

ఉపాధి రంగంలో కుల వ్యవస్థ ప్రభావం ఇంకా బలంగా ఉందని సర్వే నివేదిక పేర్కొంది. ఎస్సీ వర్గాల్లో దాదాపు సగం మంది (45.7%) దినసరి కూలీలుగానే జీవితం వెళ్లదీస్తుండగా, అగ్రవర్ణాల్లో ఈ శాతం కేవలం 10.9 మాత్రమే. అలాగే వ్యవసాయ కూలీలుగా ఎస్టీలు 32.2 శాతం, ఎస్సీలు 31.7 శాతం మంది పనిచేస్తుంటే, అగ్రవర్ణాల వారు కేవలం 5.5 శాతం మంది మాత్రమే ఆ రంగంలో ఉన్నారు. దీనికి భిన్నంగా, ప్రైవేటు రంగంలో ప్రొఫెషనల్ ఉద్యోగాల్లో అగ్రవర్ణాల వారు 14.8 శాతంతో పైచేయి సాధించగా, ఎస్టీలు కేవలం 2.8 శాతంతో అట్టడుగున ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం రిజర్వేషన్ల వల్ల కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, ప్రైవేటు రంగంలో మాత్రం వెనుకబాటు కొనసాగుతోంది.

  • ఎస్టీలకు భూమి ఉన్నా సాగునీరు నిరాశే

భూమి యాజమాన్యం విషయంలో ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఎస్టీల్లో 58.1 శాతం మందికి భూమి ఉన్నప్పటికీ, అది ఎక్కువగా మెట్ట భూమి కావడంతో వారి ఆదాయం పెరగడం లేదు. అగ్రవర్ణాలకు కేవలం 33.7 శాతం మందికే భూమి ఉన్నా, పెద్ద కమతాలు (>20 ఎకరాలు) వారి వద్దే ఎక్కువగా ఉన్నాయి. 20 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న కుటుంబాల్లో అగ్రవర్ణాల వారు 4.4 శాతం ఉంటే, ఎస్సీలు కేవలం 1 శాతం ఉన్నారు. సాగునీటి సౌకర్యం ఉన్న భూమి బీసీల వద్ద (45.9%) కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎస్సీ, ఎస్టీల వద్ద భూమి తక్కువగా ఉండటంతో వారు కూలీలుగానే మిగిలిపోతున్నారు.