V6 News

కృష్ణా బోర్డుపై ఏం చేద్దాం!... రాష్ట్ర ప్రభుత్వానికి ఇరిగేషన్ అధికారుల లేఖ

కృష్ణా బోర్డుపై ఏం చేద్దాం!... రాష్ట్ర ప్రభుత్వానికి ఇరిగేషన్ అధికారుల లేఖ
  • జల జగడాలపై మీరే తేల్చుకోవాలంటూ ఇటీవల బోర్డు లెటర్‌‌‌‌‌‌‌‌ 

హైదరాబాద్, వెలుగు: కృష్ణా బోర్డు వ్యవహార శైలిపై ఇరిగేషన్ శాఖ అధికారులు గుర్రుగా ఉన్నారు. ఏపీ జల దోపిడీని అరికట్టకుండా ఆ రాష్ట్రానికే వంతపాడుతున్న బోర్డు.. ఇటీవల జల జగడాల సమస్యను ‘మీరే తేల్చుకోండి’అంటూ రెండు రాష్ట్రాలకు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాల నీటి వాడకం, టెలిమెట్రీల ఏర్పాటును పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలంటూ రెండు వారాల కిందట తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేఖ రాసింది. 

దీనిపై అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. కృష్ణా బోర్డు తీరుపై ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలో చెప్పాలని కోరారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు తలెత్తితే.. పరిష్కరించాల్సిన బోర్డు ఇప్పుడు చేతులెత్తేసిందని లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది.  

త్రీ మెంబర్ కమిటీ మీటింగూ పెట్టలే..

నీటి వినియోగానికి సంబంధించి ప్రతిసారి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇండెంట్ పెట్టాల్సి ఉంటుంది. ఏటా వర్షా కాలానికి ముందు.. తర్వాత త్రీమెంబర్ కమిటీ మీటింగ్‌‌‌‌ను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జనవరి తొలి వారంలో త్రీ మెంబర్ కమిటీ మీటింగ్​పెడ్తామని బోర్డు చెప్పినా.. ఆ తర్వాత దాని ఊసే మర్చిపోయింది. ఏటా బోర్డు చొరవ తీసుకుని మీటింగులు నిర్వహించి రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించాల్సి ఉన్నా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. పైగా ఏపీ చెప్పినట్టు ఆడుతున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ప్రభుత్వం నిరాకరించడంతోనే త్రీమెంబర్ కమిటీ మీటింగును బోర్డు నిర్వహించలేదని అధికార వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. 

బోర్డు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వమే నిధులు ఇస్తున్నా.. ఏపీ నుంచి చిల్లగవ్వ రాకున్నా.. ఏపీ వైపే బోర్డు మాట్లాడుతున్నదన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవలి బోర్డు తీరు రాష్ట్ర ప్రయోజనాలకు మరింత విఘాతం కలిగించేలా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొత్తగా వచ్చిన మెంబర్ సెక్రటరీ.. బోర్డుకేం పట్టలేదన్నట్టుగా వ్యహరిస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆయనే విదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని, అందులో భాగంగానే ఏపీకి ప్రయోజనం చేకూరేలా మీరే తేల్చుకోవాలంటూ రెండు రాష్ట్రాలకు లేఖ రాశారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.