V6 News

సిద్దిపేట జిల్లా వంటి మామిడి మార్కెట్ తరలింపు పై రగడ 

సిద్దిపేట జిల్లా వంటి మామిడి మార్కెట్ తరలింపు పై రగడ 
  • స్థలం కేటాయించి మూడేండ్లవుతున్నా కదలని పనులు 
  • ఓపెన్ ప్లాట్ల కోసం రైతుల ఆందోళన
  • 94 మంది రైతుల నుంచి 86 ఎకరాల సేకరణ 

సిద్దిపేట/ములుగు, వెలుగు: సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి కూరగాయల మార్కెట్ తరలింపుపై వివాదం నడుస్తోంది. రాష్ట్రంలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్ గా పేరున్న వంటిమామిడి ఉదయం మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న వేరొక స్థలానికి తరలించేందుకు మూడేండ్ల కింద స్థలం కేటాయించారు. రాజీవ్ రహదారిని ఆనుకునే అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతండటంతో ప్రతిరోజు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. దీంతో మూడేండ్ల కింద ప్రస్తుత మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎదురుగా ఉన్న స్థలాన్ని ఉదయం మార్కెట్ కోసం కేటాయించారు.

వంటిమామిడి కూరగాయల మార్కెట్ వద్ద ఏర్పడుతున్న ఇబ్బందులతో పాటు విస్తరణ కోసం ప్రత్యేక స్థలాన్ని మూడేండ్ల కింద ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుత మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎదురుగా రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న మూడు సర్వే నంబర్లలో 94 మంది రైతుల నుంచి మొత్తం 86 ఎకరాలు సేకరించారు. ఈ భూములకు ఎకరానికి రూ.8.50 లక్షలు పరిహారం అందజేసి  250 గజాల ఓపెన్ ప్లాట్ ఇవ్వడానికి అధికారులు అంగీకరించారు. సేకరించిన భూమిలో  59.16 ఎకరాలను ఉదయం నిర్వహించే కూరగాయల  మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేటాయించడమే కాకుండా మార్కెట్ కమిటీ  పేరిట బదలాయించారు. ఇది జరిగి మూడేండ్లు కావస్తున్నా భూములు సేకరించిన రైతులకు ఇండ్ల స్థలాలు ఇవ్వక పోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. 

ఓపెన్ ప్లాట్ల పేచీ

భూములు సేకరించిన రైతులకు సకాలంలో పరిహారం అందజేసినా ఓపెన్ ప్లాట్ల కేటాయింపు జరగకపోవడం ప్రస్తుతం ఆందోళనకు కారణమైంది. మూడేండ్ల కింద సేకరించిన స్థలంలోని సర్వే నంబర్ 71లో 94 మంది రైతులకు ఓపెన్ ప్లాట్ల కేటాయింపునకు హామీ ఇచ్చినా అది అమలుకు నోచలేదు. కాగా విలువైన భూములకు తక్కువ పరిహారం ఇచ్చారని కొందరు భూ నిర్వాసితులు కోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో మార్కెట్ అధికారులు స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఉదయం మార్కెట్ నిర్వహించాలని ప్రయత్నించినా భూములు కోల్పోయిన రైతులు వారిని అడ్డుకొని  కొందరు ఓపెన్ ప్లాట్లను కేటాయించాలని ఆందోళనలు చేస్తున్నారు.

ఇదే సందర్భంలో కొందరు తమ విలువైన భూములు తమకు తిరిగి వెనక్కు  ఇవ్వాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తెరపైకి తెచ్చారు. దీంతో వంటిమామిడి ఉదయం మార్కెట్ ఏర్పాటుపై ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇటీవల మార్కెట్ ఏర్పాటు కోసం భూమి చదును పనులను మొదలు పెట్టగా భూ నిర్వాసితులు అడ్డుకుని రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా ఓ రైతు ఒంటిపై పెట్రోలు చల్లుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.

రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ జామ్

వంటిమామిడి ఉదయం కూరగాయల మార్కెట్ తరలింపు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పడటంతో పాత మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే క్రయవిక్రయాలు నిర్వహిస్తున్నారు. మార్కెట్  యార్డు బయట భారీఎత్తున కొనుగోళ్ల కారణంగా రాజీవ్ రహదారిపై ప్రతి రోజు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఒక్కోసారి కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ జామ్ సమస్యతో పాటు ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. రోడ్డుపైనే  వాహనాల్ని నిలిపి కూరగాయలను లోడ్ చేయడం, కొనుగోలు చేయడం వల్ల రాజీవ్ రహదారిపై వెల్లే భారీ వాహనాలకు ఆటంకంగా మారుతోంది.

రాజీవ్ రహదారిని ఆనుకుని  వంటిమామిడి మార్కెట్ ఉండటంతో ఉదయం సాయంత్రం వేళల్లో పెద్దసంఖ్యలో రైతులు, కొనుగోలుదారులు తరలిరావడం ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తరలించాలని నిర్ణయించి స్థలాన్ని సేకరించినా భూములిచ్చిన రైతుల ఆందోళనతో  పనులు ముందుకు సాగడం లేదు.

విలువైన భూములు కోల్పోయాం

వంటిమామిడి ఉదయం మార్కెట్ కోసం విలువైన భూములను కోల్పోయాం. భూములు సేకరించేటప్పుడు 250 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామని చెప్పి మూడేండ్లు  అయితాంది. అధికారులు ఇచ్చిన హామీని అమలుచేయకుండా భూమిని చదును చేయడం తగదు. ఇంటి స్థలాలు ఇచ్చి పనులు చేసుకోవాలని కోరుతున్నాం. మా సమస్యను పరిష్కరించకుంటే  సేకరించిన భూముల్లోకి అధికారులను వెళ్లనివ్వం. పనులను అడ్డుకుంటం.-లక్ష్మణ్ గౌడ్, రైతు వంటిమామిడి

సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం

వంటిమామిడి ఉదయం మార్కెట్ కోసం భూములు సేకరించిన రైతుల ఓపెన్ ప్లాట్ల కేటాయింపు  సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. నిర్వాసితులకు ఇండ్ల స్థలాల కేటాయింపుపై  కలెక్టర్  ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుని ముందుకు వెళ్తాం. -రవీందర్ రెడ్డి, తహసీల్దార్, ములుగు