రోడ్ల రిపేర్లకు 240 కోట్లు అవసరం

రోడ్ల రిపేర్లకు 240 కోట్లు అవసరం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు రోడ్లు దెబ్బతిన్నాయి. చాలాచోట్ల వరదలకు కల్వర్టులు, రోడ్లు కొట్టుకుపోయాయి. కొన్ని రూట్లలో రాకపోకలు నిలిచిపోయాయి. శిథిలావస్థలో ఉన్న ఇండ్లు కూలిపోయాయి. మొత్తంగా వర్షాల వల్ల రూ.350 కోట్ల నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 కిలోమీటర్ల మేర పంచాయతీరాజ్ రోడ్లు, 108 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బీ రోడ్లు దెబ్బతిన్నట్లు రిపోర్టు ఇచ్చారు. నిజామాబాద్​లో 13 కిలోమీటర్లు, వరంగల్​లో 29 కిలోమీటర్లు. ఆదిలాబాద్​లో 13 కిలోమీటర్లు, మరికొన్ని ప్రాంతాల్లో 7 కిలోమీటర్ల మేర పంచాయతీరాజ్​రోడ్లు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. వీటి రిపేర్లకు రూ.60 కోట్లు, ఆర్ అండ్ బీ రోడ్ల రిపేర్లకు రూ.180 కోట్లు ఖర్చవుతాయని చెప్పారు. 

రెస్క్యూ టీమ్స్ రెడీ..  

రాష్ట్ర వ్యాప్తంగా 4 ఎన్డీఆర్ఎఫ్ టీమ్​లు,  జిల్లాల్లో 18 స్పెషల్ ​టీమ్​లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఇతర లోతట్టు ప్రాంతాల్లో నీటిని తొలగించేందుకు 11డీ వాటరింగ్ మోటర్లు రెడీగా ఉన్నాయని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇట్లనే వర్షాలు కురిస్తే దక్షిణ తెలంగాణలోని చాలా ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.