వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో వర్ష బీభత్సం

వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో వర్ష బీభత్సం
  • నేల కూలిన చెట్లు, విద్యుత్​స్తంభాలు
  • కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
  • జలమయమైన పట్టణాలు
  • భీంపల్లి పది గొర్రె పిల్లలు మృతి

ఉమ్మడి వరంగల్​జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఈ అకాల వర్షంతో వాతావరణం కాస్త చల్లబడినా, కొంత నష్టం చేకూర్చింది. గాలిదుమారంతో కూడిన జోరువానకు పలుచోట్ల చెట్లు, విద్యుత్​ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో కరెంట్​సరఫరాకు అంతరాయం కలిగింది. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్​యార్డుల్లో ఆరబోసిన ధాన్యం తడిసి వరద పాలయ్యింది. 

పలు చోట్ల రోడ్లపై చెట్లు అడ్డంగా విరిగి పడడంతో ట్రాఫిక్​జామ్ ​ఏర్పడింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని భీంపల్లిలో ఈదురు గాలులకు కరెంటు వైర్లు రాపిడి జరగడంతో పంట పొలంలో మంటలు అంటుకున్నాయి. దీంతో మేత కోసం వచ్చిన గొర్రెలు మంటల్లో చిక్కుకుని, పది గొర్రె పిల్లలు మృతి చెందాయి. ఉమ్మడి జిల్లాలోని ఆయా పట్టణాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు నీటమునిగాయి.

వెలుగు, ఉమ్మడి జిల్లా నెట్​వర్క్​