సీఎం రోడ్‌‌షో విజయవంతం చేయాలి : జీవన్ రెడ్డి

సీఎం రోడ్‌‌షో విజయవంతం చేయాలి : జీవన్ రెడ్డి

ఆర్మూర్, వెలుగు:  చక్కెర ఫ్యాక్టరీలు  ప్రభుత్వ నిర్వహణలో  పునః ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే  మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేశారని నిజామాబాద్​ కాంగ్రెస్​ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గుర్తు చేశారు. ఆర్మూర్​ అంబేద్కర్​ చౌరస్తా వద్ద బుధవారం జరిగే సీఎం రోడ్ షో స్థలం, హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు.  అనంతరం మంగళవారం ఆర్మూర్ లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వినయ్ రెడ్డితో జీవన్​ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. చక్కెర ఫ్యాక్టరీలు సహకార రంగంలో ప్రారంభిస్తామని అమిత్ షా చెప్పడంతోనే వారి నిజ స్వరూపం బయటపడిందన్నారు. 

పసుపు బోర్డు నిజామాబాద్ లో ఏర్పాటు చేస్తామని అమిత్ షా చెప్పడం ద్వారా ఐదేళ్ల నుంచి ఏర్పాటు చేయలేదనే విషయాన్ని ఒప్పుకున్నారని తేలిపోయిందన్నారు.  స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా మద్దతు ధర కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు.  ఉచిత విద్యుత్, రైతు భరోసా, రుణ మాఫీ చేయడం లో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ రైతు పక్ష పాతి అన్నారు. 

 దశాబ్ద కాలం లో బీజేపీ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. లక్కంపల్లి సెజ్ లో వ్యవసాయ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు రాయితీలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్​ పార్టీ టౌన్​ ప్రెసిడెంట్ సాయిబాబాగౌడ్​, వన్నెల్ దేవి అయ్యప్ప శ్రీనివాస్, పస్కా నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.