కామారెడ్డి: కామారెడ్డిలో ముగ్గురు పిల్లలను హత్య చేసిన కన్న తండ్రి కేసు గురించి ఏఎస్పీ చైతన్య రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. అప్పుల బాధ, కుటుంబ పోషణ భారమై పిల్లలను చెరువులో తోసేసి హత్య చేసినట్లు విచారణలో నిందితుడు చెప్పినట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితుడు ఇస్మాయిల్ను ఇప్పటికే అదుపులో తీసుకున్నామని చెప్పారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వికాస్‌నగర్‌లో కనిపించకుండా పోయిన పదేండ్లలోపు ముగ్గురు అక్కాచెల్లెళ్లు దారుణ హత్యకు గురయిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.
కన్నతండ్రే ఆ ముగ్గురు చిన్నారి కూతుళ్లను చెరువులో ముంచి చంపినట్లు తేలడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల ప్రకారం..వికాస్‌నగర్‌కు చెందిన ఇస్మాయిల్, షబీనా దంపతులకు షీపత్ (8), అయత్ (7), మరియం (5) అనే ముగ్గురు కుమార్తెలున్నారు. ఇస్మాయిల్ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. శనివారం ఉదయం 11 గంటలకు తినుబండారాలు కొనిచ్చి పంపిస్తానని పిల్లలను ఇస్మాయిల్ తన ఆటోలో తీసుకెళ్లాడు. గంటలు గడిచినా పిల్లలు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి షబీనా.. భర్తను ప్రశ్నించగా.. తాను షాపు దగ్గర వదిలేసి కిరాయికి వెళ్లానని చెప్పాడు.
దీంతో షబానాతో పాటు కుటుంబసభ్యులు పిల్లల కోసం చుట్టుపక్కల వెతికారు. అయినా చిన్నారుల ఆచూకీ దొరకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా.. పిల్లలను ఇస్మాయిల్ తన ఆటోలో చెరువు వైపు తీసుకెళ్లినట్లు తేలింది.
ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆర్థిక ఇబ్బందుల వల్లే ముగ్గురు కూతుళ్లను చెరువులో ముంచి చంపినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు చెరువు వద్దకు వెళ్లి.. ఈతగాళ్ల సాయంతో గాలించారు. రాత్రి 11 గంటలకు అయత్, మరియంల మృతదేహాలు లభించగా, షీపత్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి..ఇస్మాయిల్ను అదుపులోకి తీసుకున్నారు.
* కామారెడ్డిలోని డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి మీడియా సమావేశం
* కామారెడ్డిలో ముగ్గురు పిల్లలను హత్య చేసిన కన్న తండ్రి కేసు వివరాలు వెల్లడి
* ముగ్గురు పిల్లలను హత్య చేసింది కన్నతండ్రి ఇస్మాయిల్
* ఇస్మాయిల్ను ఇప్పటికే అదుపులో తీసుకున్నాం.
* అప్పుల బాధ, కుటుంబ పోషణ భారమై హత్య చేసినట్లు విచారణలో వెల్లడి
* పిల్లలను పెద్ద చెరువులో తోసి హత్య చేసి, ఏమీ తెలియనట్లు నటించిన తండ్రి ఇస్మాయిల్
* భార్యతో కలిసి పిల్లలు కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
