సంత్ సేవాలాల్ బోధనలు ఆదర్శం : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

సంత్ సేవాలాల్ బోధనలు ఆదర్శం : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సంత్​ సేవాలాల్ బోధనలు మానవాళికి ఆదర్శమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని కలెక్టరేట్ సమీపంలో ఆదివారం నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని బోగ్​ బండార్​ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తండాల్లో మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం కృషి చేయాలని, అడవి బిడ్డల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేస్తామన్నారు. అనంతరం కొత్తగూడెం కార్పొరేషన్​ మేయర్​ మూడ్​ గణేశ్​ను తలపాగాతో సన్మానించారు.

అంతకుముందు జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్​ ఆఫీస్​లో ఫారెస్ట్​ ఆఫీసర్స్, పోడు రైతులు, స్థానిక నేతలతో సమావేశం నిర్వహించారు. ఏజెన్సీలో అభివృద్ధి పనులకు అటవీశాఖ సహకరించాలని కోరారు. పోడు సాగుదారులపై నిర్భందాలు ఆపాలని, భూములను లాక్కొని వారి పొట్ట కొట్టవద్దన్నారు.​