హైదరాబాద్, వెలుగు: పాలసీ మేకర్లు, ఇండస్ట్రీ లీడర్లు, ఇన్నోవేటర్లు, ఐఐటీ పూర్వ విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన పాన్‌ఐఐటీ సమిట్ 2026 ఆదివారం హైదరాబాద్‌లోని మాధాపూర్‌లో ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో 250 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. లోక్‌సభ సభ్యుడు ఈటల రాజేందర్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ దేశ అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ ట్యాలెంట్ ఉపయోగపడాలన్నారు.
ఆరోగ్య రంగంలో వచ్చిన డిజిటల్ మార్పులను నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ సునీల్ కుమార్ బర్న్వాల్ వివరించగా, రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎనర్జీ) నవీన్ మిట్టల్ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై విశ్లేషణ ఇచ్చారు. హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీల) కు కేంద్రం ఎదుగుతోందని రాష్ట్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రత్యేక కార్యదర్శి భావేష్ మిశ్రా తెలిపారు.
భవిష్యత్తు రక్షణలో ఏఐ, స్పేస్ టెక్నాలజీ కీలకమని డీఆర్‌డీఓ మాజీ డైరెక్టర్ టెస్సీ థామస్ అన్నారు. సమిట్‌లో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, హెల్త్‌కేర్, ఎనర్జీ, డిఫెన్స్ ఇన్నోవేషన్ వంటి అంశాలపై ప్రత్యేక సెషన్లు జరిగాయి. స్టార్టప్‌ల కోసం పిచ్ సెషన్‌ను కూడా నిర్వహించారు.
