కరీంనగర్, వెలుగు: విధులను నిర్లక్ష్యం చేయడం, తరచూ గైర్హాజరు కావడం, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో హుజూరాబాద్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ డి.చందనను సస్పెండ్ చేస్తూ వరంగల్ జోన్ జాయింట్ లేబర్ కమిషనర్ వినీత ఉత్తర్వులు జారీ చేశారు. భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచినట్లు వచ్చిన ఫిర్యాదులపై ఇటీవల కరీంనగర్ డిప్యూటీ లేబర్ కమిషనర్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ విచారణ నిర్వహించారు.
వారు సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్మికులకు సంబంధించిన సమస్యలు, సంక్షేమ పథకాల దరఖాస్తులను సిటిజన్ చార్టర్ ప్రకారం త్వరగా పరిష్కరించాలని లేబర్ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
