ఉండలేక.. ఊరిడిచి వెళ్లలేక..! ఉద్యమం మొదలుపెట్టి తరచూ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న గ్రామస్తులు

ఉండలేక.. ఊరిడిచి వెళ్లలేక..! ఉద్యమం మొదలుపెట్టి తరచూ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న గ్రామస్తులు
  • బయో మైనింగ్ పేరుతో రూ.45 కోట్ల వరకు ఖర్చు
  • కొత్తగా వెలువడుతున్న చెత్తకు పరిష్కారం దొరక్క ఇబ్బందులు

హనుమకొండ, వెలుగు: ఓరుగల్లు డంపింగ్ యార్డు సమస్య చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మండుతున్న చెత్త గుట్టల్లోంచి వచ్చే పొగ దట్టంగా కమ్ముకుంటుండటంతో మడికొండ, రాంపూర్ ప్రజలు శ్వాస తీసుకోవడానికి కూడా అవస్థ పడాల్సివస్తోంది. దీంతో ఊరిలో ఉండలేక ఉన్న ఊరిని విడిచి వేరే చోటుకు వెళ్లలేక వేదనకు గురవుతున్నామని స్థానికులు వాపోతున్నారు. వాస్తవానికి డంపింగ్ యార్డులోని చెత్త గుట్టలను కరిగించేందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.కోట్లు ఖర్చు పెట్టి బయో మైనింగ్ నిర్వహిస్తున్నా, సమస్య కొలిక్కి రాలేదు. దీంతో పొగను భరించలేక ఇక్కడి ప్రజలు ఏడాది కిందట 'సేవ్ మడికొండ' పేరున ఉద్యమం మొదలుపెట్టారు. తరచూ ఆఫీసర్లకు వినతిపత్రాలు ఇవ్వడంతో పాటు రోడ్డెక్కి ఆందోళనలకు దిగుతున్నారు. ఇకపై రిలే నిరాహార దీక్షలు చేపట్టేందుకు రెడీ అయ్యారు.

రూ.45 కోట్ల వరకు ఖర్చు..!

గ్రేటర్ వరంగల్ పరిధిలోని 66 డివిజన్ల నుంచి వెలువడే తడి, పొడి చెత్తను తరలించేందుకు 2007లో మడికొండ, రాంపూర్ శివారులో దాదాపు 32 ఎకరాల్లో డంప్​ యార్డు ఏర్పాటు చేశారు. కానీ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టం సరిగా లేక లక్షలాది మెట్రిక్ టన్నుల చెత్త పోగైంది. దీంతో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా మొదట డంప్ యార్డులోని 3 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ధి చేసేందుకు రూ.37 కోట్లతో బయో మైనింగ్ చేపట్టారు. చెన్నైకి చెందిన లీప్ ఎకోటెక్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ పనులు దక్కించుకుని, మరో సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి గతేడాది నిర్దేశిత చెత్తను బయో మైనింగ్ చేసింది.

 అయినా డంపింగ్ యార్డులో ఇంకా నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల వరకు చెత్త పోగై ఉండటంతో గత డిసెంబర్ లో మరో సంస్థకు బయో మైనింగ్ ప్రాజెక్టు అప్పజెప్పారు. సుమారు రూ.3.3 కోట్లతో 44 వేల మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ధి చేసేందుకు హైదరాబాద్ కు చెందిన క్యూబ్ బయో ఎనర్జీ ప్రై.లిమిటెడ్ కు పనులు అప్పగించారు. ఇటీవల అది కూడా పూర్తి కాగా, ఇంకా పెద్ద మొత్తంలో చెత్త పోగై ఉంది. దీంతో మరో 55 వేల మెట్రిక్ టన్నులను బయో మైనింగ్ చేపట్టేందుకు ఈ మధ్యనే మళ్లీ అదే సంస్థకు రూ.4.6 కోట్లతో అప్రూవల్ ఇచ్చారు. ఈ పనులు ఒకట్రెండు రోజుల్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని అక్కడి సిబ్బంది చెబుతున్నారు.

ప్రత్యామ్నాయం లేక సమస్య..

వరంగల్ ట్రై సిటీతో పాటు 42 విలీన గ్రామాల పరిధిలోని దాదాపు 2.5 లక్షల ఇండ్ల నుంచి ప్రతిరోజు 450 మెట్రిక్ టన్నుల వరకు తడి, పొడి చెత్త వెలువడుతోంది. ఆ చెత్తనంతా మడికొండ డంప్ యార్డుకే తరలిస్తుండటంతో లక్షల టన్నుల వేస్టేజీ పోగవుతోంది. ఈ నేపథ్యంలోనే వరంగల్ నగరానికి నాలుగు వైపులా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదించారు. కానీ, స్థల సమస్య కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో పాటు వరంగల్ తో పాటు చుట్టుపక్కల మున్సిపాలిటీల చెత్తను హుజురాబాద్ సమీపంలో ఏర్పాటు చేయబోయే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు తరలించేలా ప్లాన్​ చేస్తున్నారు.

కానీ, ఆ ప్లాంట్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో వరంగల్ నగరంలో ప్రతిరోజు కొత్తగా వెలువడుతున్న చెత్తను తప్పనిసరిగా మడికొండ డంప్ యార్డుకే తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఓ వైపు బయో మైనింగ్ ద్వారా కొంతమేర చెత్త కరుగుతున్నా కొత్తగా జమవుతున్న వేస్టేజీతో సమస్య మొదటికొస్తోంది. 

అవస్థలకు తాళలేక ఆందోళనలు..

మడికొండ డంప్ యార్డులోని చెత్త గుట్టల్లో తరచూ మంటలు వ్యాపిస్తున్నాయి. రాత్రయితే చాలు డంపింగ్ యార్డు పొగ మడికొండ, రాంపూర్ తో పాటు చుట్టుపక్కల గ్రామాలను కప్పేయడం కామనైపోయింది. దీంతో ఇక్కడ గాలి, నీరు కలుషితమవడమే కాకుండా చాలామంది శ్వాసకోశ సమస్యల బారినపడుతున్నారు. రెండ్రోజుల కింద కూడా డంప్ యార్డు చెత్త తగలబడి పొగ వ్యాపించగా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో ఫైరింజన్లు తెచ్చి చెత్త కుప్పలను చల్లార్చారు. తరచూ ఇలాగే జరుగుతుండడంతో డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి వేరేచోటుకు తరలించాలనే డిమాండ్ తో మడికొండ, రాంపూర్, చుట్టుపక్కల ప్రజలు గతేడాది జనవరి 19న ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అప్పటినుంచి గ్రేటర్ కమిషనర్, హనుమకొండ కలెక్టర్ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నవిస్తూ, డంప్ యార్డు పొగ కమ్మేసినప్పుడల్లా ఆందోళనలు చేపడుతున్నారు. 'సేవ్ మడికొండ – ఫ్రం డంపింగ్ యార్డు' నినాదంతో సోషల్ మీడియాలోనూ పోరాటం మొదలుపెట్టారు. ఇకనైనా డంపింగ్ యార్డును తరలించి తమ ప్రాణాలను కాపాడాలని లేదంటే రిలే నిరాహార దీక్షలకు దిగుతామని 
స్పష్టం చేస్తున్నారు.

ఊరిలో ఉండలేకపోతున్నం..

మడికొండ డంప్ యార్డు నుంచి వచ్చే పొగ వల్ల ఊరిలో ఉండలేకపోతున్నాం. ఊరి విడిచి వెళ్లాలంటే మనసొప్పడం లేదు. అందుకే డంపింగ్ యార్డు బారినుంచి మడికొండను రక్షించుకునేందుకు ఉద్యమం మొదలుపెట్టినం. గతేడాది నుంచి అధికారులకు వందలాది లెటర్లు ఇచ్చినం. రేపటి నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టి పోరాటం చేయనున్నాం. దువ్వ నవీన్, మడికొండ

పొగ వల్ల నరకం చూస్తున్నం..

డంపింగ్ యార్డు పొగ వల్ల నిత్యం నరకం అనుభవిస్తున్నం. గాలి, నీళ్లు కలుషితం కావడం వల్ల చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. అందుకే డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి వేరే చోటుకు తరలించాలని గతేడాది నుంచి ఉద్యమం చేస్తున్నం. డంపంగ్ యార్డును తరలించేదాకా పోరాటం కొనసాగిస్తం.- తౌటిరెడ్డి కరుణాకర్ రెడ్డి, మడికొండ