భద్రాద్రి రామయ్యకు పంచామృతాభిషేకం.. స్వామి వారికి విశేషంగా అలంకరణ

భద్రాద్రి రామయ్యకు పంచామృతాభిషేకం.. స్వామి వారికి విశేషంగా అలంకరణ

భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామికి ఆదివారం గర్భగుడిలో పంచామృతాభిషేకం ఘనంగా నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం బాలబోగం నివేదించి మూలవరులకు మంజీరా(పసుపు ముద్ద)లు అద్దారు. తరువాత స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై ఆవుపాలు, నెయ్యి, పెరుగు, తేనె, పంచదారలతో పంచామృతాభిషేకం చేశారు. అనంతరం అభిషేక జలాలను భక్తులకు పంపిణీ చేశారు.

 స్వామివారికి విశేష అలంకరణలు చేసి హారతులు సమర్పించారు. బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించగా భక్తులు పాల్గొన్నారు. తదనంతరం కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం నిర్వహించారు. భక్తులు కల్యాణంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం దర్బారు సేవ నిర్వహించారు. 

కలెక్టర్ అంకిత్ భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈవో దామోదర్‌‌రావు ఆధ్వర్యంలో అర్చకులు కలెక్టర్‌‌కు పరివట్టం కట్టి స్వాగతం పలికారు. గర్భగుడిలో పూజలు చేసిన అనంతరం లక్ష్మీ తాయారు అమ్మవారి సన్నిధిలో వేదాశీర్వచనం, ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు.