భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులోకి ఎంపికైనప్పటికీ, అతని ఆరోగ్యంపై బీసీసీఐకి ఇంకా పూర్తి స్పష్టత లేదు. 39 ఏళ్ల రోహిత్ కండరాల గాయం కారణంగా ఐపీఎల్ 2026లో చాలా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. సన్నబడినప్పటికీ.. వన్డే క్రికెట్‌లో 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసే సత్తువ అతనిలో ఉందా? ఐపీఎల్‌లో ఉన్నట్లుగా వన్డేల్లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ ఉండదు. ముఖ్యంగా వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్ జరిగే నాటికి రోహిత్‌కు దాదాపు 41 ఏళ్లు నిండుతాయి, ఈ విషయాన్ని బీసీసీఐ కూడా గమనిస్తోంది. 41 ఏళ్ల వయసులో ప్రపంచకప్ ఆడాలంటే రోహిత్ శరీరం సహకరిస్తుందా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
మరోవైపు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో తిరిగి జట్టులోకి రావడానికి ముందు, అతను దాదాపు మూడు వారాల పాటు ఎంఐ జట్టులో ఆడలేదు. వెన్నునొప్పి కారణంగా మూడు వారాల పాటు ఆటకు దూరమైన హార్దిక్.. వన్డేల్లో పది ఓవర్ల పాటు బౌలింగ్ చేయగలడా? సెలక్షన్ కమిటీకి తన ఫిట్‌నెస్‌పై హార్దిక్ ఇప్పటికీ సరైన సమాచారం ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే.. అతని ఫిట్‌నెస్ అద్భుతం! కానీ కోహ్లీని, రోహిత్‌ను ఇకపై ఒకేలా పోల్చలేం. అందుకే రోహిత్‌కు ప్రత్యామ్నాయంగా యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్‌ల పేర్లను సెలెక్టర్లు పరిశీలిస్తున్నారు. బీసీసీఐ వైద్య బృందం నివేదిక తర్వాత రోహిత్ విషయంలో ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకోబోతున్నారనే ది ప్రశ్నార్థకంగా మారింది.
