నియోజకవర్గ నిధుల కోసం ఎంపీ వర్కవుట్లు

నియోజకవర్గ నిధుల కోసం ఎంపీ వర్కవుట్లు

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని ఎంపీ, బీజేపీ నాయకుడు అనిల్ ఫిరోజియా.. తన నియోజకవర్గ నిధుల కోసం.. వర్కవుట్లు చేస్తున్నారు. నియోజకవర్గ నిధులేంటీ.. వర్కవుట్లేంటీ అనుకుంటున్నారా. అవును నిజమే. వ్యాయామం, ఆరోగ్య నియమాలు, సైక్లింగ్ చేస్తూ ఆయన బరువు తగ్గించుకునే పనిలో నిమగ్నమయ్యారు.ఇవన్నీ ఎందుకనుకుంటున్నారు.. ప్రజల కోసమే అంటున్నారు ఫిరోజియా. దీని వెనక ఉన్నది ఎవరో కాదు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరేనని సమాధానం కూడా చెప్తున్నారు. అసలేమైంది. ఫిరోజియా వర్కవుట్లు చేయడానికి నితిన్ గడ్కరీ కారణమెలా అయ్యాడు అనే విషయానికొస్తే..

ఉజ్జయినిలోని మాల్వాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన నిమిత్తం పర్యటనకు వచ్చిన నితిన్ గడ్కరీ.. అధిక బరువుతో ఉన్న ఫిరోజియాను చూసి ఆశ్చర్యపోయారటయ. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న గడ్కరీ.. తరచూ నన్ను నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని అడుగుతుంటాడు. అందుకే.. బరువు తగ్గితే ఆ నిధులు విడుదల చేస్తానంటూ మాట ఇచ్చారట. అప్పట్లో తాను కూడా 135 కేజీలు ఉండే వాడినన్న ఆయన.. ఇప్పుడు 93 కేజీలయ్యానని అన్నారట. ఇక్కడ గడ్కరీ పెట్టిన కండిషన్ ఏంటంటే.. నిధులు కావాలంటే ఫిరోజియా బరువు తగ్గాలని.. ఎన్ని కేజీలు తగ్గితే.. కేజీకి రూ.1000కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తానని అందరూ చూస్తుండగానే స్టేజీ మీదే చెప్పారట. దీంతో అప్పట్నుంచి బరువు తగ్గించుకునే పనిలో పడ్డాడు ఫిరోజియా. 

యోగా, వివిధ వర్కవుట్లు, స్విమ్మింగ్ లాంటివి చేస్తూ.. ఫిబ్రవరిలో 125 కేజీలున్న అనిల్.. మూడు నెలల్లో 15 కేజీలు తగ్గి.. 112 కేజీలకు చేరి అందర్నీ ఆశ్చర్యపరిచారు. త్వరలోనే 100 కేజీల తక్కువకు బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని అంటున్నారు ఫిరోజియా. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఛాలెంజ్ ప్రకారం ఇప్పటి వరకూ 15 కేజీలు తగ్గానని.. త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఆయన్ను కలుస్తానని.. గడ్కరీ ఇచ్చిన మాట ప్రకారం.. రూ.15వేల కోట్లు మంజూరు చేస్తారని ఆశిస్తున్నానంటూ అనిల్ ఫిరోజియా తెలిపారు.