- ఆప్ ఎమ్మెల్యేల ఆరోపణ
- ఇతరులను కూడా చేర్పిస్తే 25 కోట్లు ఆఫర్ చేసిన్రని వెల్లడి
- లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. బీజేపీ
న్యూఢిల్లీ: ఢిల్లీలోని తమ సర్కార్ ను కూల్చేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఆప్ ఆరోపించింది. అందుకోసం తమ పార్టీ నేతలకు డబ్బులు ఇస్తామని ఆశ చూపుతోందని, లేదంటే కేసులు పెడతామని బెదిరిస్తోందని మండిపడింది. తమ పార్టీ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందని ఫైర్ అయింది. ఆప్ ఎమ్మెల్యేలు అజయ్ దత్, సంజీవ్ ఝా, సోమ్నాథ్ భారతి, కుల్దీప్ కుమార్ తో కలిసి ఆ పార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ఆప్ ఎమ్మెల్యేలను లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. అజయ్ దత్, సంజీవ్ ఝా, సోమ్నాథ్ భారతి, కుల్దీప్ కుమార్లను బీజేపీ నేతలు సంప్రదించారు. పార్టీలో చేరితే రూ.20 కోట్లు, ఇతర ఎమ్మెల్యేలను చేర్పిస్తే రూ.25 కోట్ల చొప్పున ఇస్తామని బేరం మాట్లాడారు. కాదంటే సిసోడియా లెక్క సీబీఐ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారు” అని సంజయ్ సింగ్ ఆరోపించారు. సిసోడియా, ఆప్ ఎమ్మెల్యేలు కలిసి ఆపరేషన్ లోటస్ ను అడ్డుకున్నారని చెప్పారు.
ప్రభుత్వాన్ని పడగొడ్తమన్నరు..
ఎలాగైనా ఢిల్లీ సర్కార్ను పడగొడ్తమని బీజేపీ నేతలు తనతో చెప్పారని సోమ్నాథ్ భారతి తెలిపారు. ‘‘సిసోడియాపై పెట్టిన కేసులు ఫేక్ అని మాకు తెలుసు. కానీ బీజేపీ సీనియర్ లీడర్లు ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని నిర్ణయించారు. ఆ పని మాకు అప్పగించారు” అని బీజేపీ నేతలు తనతో చెప్పారని ఆరోపించారు. బీజేపీ నేతలు తమను కూడా సంప్రదించి, రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్లు ఆఫర్ చేశారని ఆప్ మిగతా ఎమ్మెల్యేలు ఆరోపించారు. కాగా, ఈ విషయంపై మనీశ్ సిసోడియా స్పందించారు. ‘‘నా విషయంలో ఫెయిల్ అయిన బీజేపీ నేతలు.. ఇప్పుడు మా ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారు. దర్యాప్తు సంస్థల పేరు చెప్పి బెదిరిస్తున్నారు. కానీ వాళ్లు కేజ్రీవాల్ సైన్యం. ప్రాణ త్యాగమైనా చేస్తారు కానీ పార్టీకి ద్రోహం చేయరు” అని ఆయన ట్వీట్ చేశారు.
ఆధారాలుంటే చూపండి: బీజేపీ
లిక్కర్ స్కామ్ పై ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆప్ తమపై ఆరోపణలు చేస్తోందని బీజేపీ మండిపడింది. ‘‘ఆప్ సర్కార్ ను కూల్చేందుకు మేం ప్రయత్నం చేస్తున్నామని ఆరోపిస్తున్నారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు ఆఫర్ చేశామని, దానికి సంబంధించి ఆడియో క్లిప్స్ ఉన్నాయని అంటున్నారు. ఆధారాలుంటే ఎందుకు చూపించడంలేదు” అని బీజేపీ అధికార ప్రతినిధి
షెహజాద్ పూనావాలా ప్రశ్నించారు.
ఇయ్యాల ఆప్ ఎమ్మెల్యేల భేటీ..
ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చి, తమ సర్కారును పడగొట్టాలని బీజేపీ చూస్తోందని, ఇది చాలా సీరియస్ విషయమని సీఎం, ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. దీనిపై చర్చించేందుకు ఆయన తన ఇంట్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. గురువారం పార్టీ మీటింగ్ ఉంటుందని, దీనికి ఎమ్మెల్యేలందరూ రావాలని కేజ్రీవాల్ ఆదేశించారు. శుక్రవారం అసెంబ్లీ స్పెషల్ సెషన్ నిర్వహించాలని నిర్ణయించారు.

