7 యాక్సిడెంట్లు 3 ప్రాణాలు

7 యాక్సిడెంట్లు 3 ప్రాణాలు

ఆర్టీసీ బస్సులకు యాక్సిడెంట్లు
సంగారెడ్డి జిల్లాలో ఆటోలను ఢీకొన్న బస్సులు
సదాశివనగర్​లో ఇద్దరు మృతి
సంగారెడ్డి జిల్లాలో
ఆటోలను ఢీకొన్న బస్సులు
సదాశివనగర్​లో ఇద్దరు మృతి
16 మందికి తీవ్రంగా గాయాలు
మిన్పూర్​లో ఒకరు మృతి
ఇంకొన్ని ప్రాంతాల్లో ప్రమాదాలు..
పదుల సంఖ్యలో క్షతగాత్రులు

సంగారెడ్డిటౌన్/పుల్కల్, వెలుగు నెట్వర్క్: ఆర్టీసీ బస్సులు ఆటోలను ఢీకొన్న ప్రమాదాల్లో సోమవారం ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. 20 మంది వరకు తీవ్రంగా గాయాలపాలయ్యారు. అనుభవం లేని తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు నడిపించడం వల్లే ఈ ప్రమాదాలు జరిగాయని ప్రయాణికులు మండిపడుతున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్​ మండలం గొల్లపల్లిలో ఓ బంధువు చనిపోవడంతో అంత్యక్రియలకు వెళ్లొస్తున్న వారి ట్రాలీ ఆటోను ఎదురుగా వస్తున్న హైదరాబాద్–2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ట్రాలీలో ఉన్న 18 మందిలో సంగారెడ్డి జిల్లా పుల్కల్​ మండలం చౌటకూర్​కు చెందిన అత్తాకోడళ్లు బాగమ్మ(55), చంద్రకళ(35) అక్కడిక్కడే మృతి చెందారు. మరో 16 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

ఆటో ట్రాలీలో ఉన్నవారంతా చౌటకూర్​ గ్రామానికి చెందినవారే. సంగారెడ్డికి సమీపంలోని ఎంఎన్ఆర్​ చౌరస్తా సదాశివనగర్​ వద్ద సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. అందులో ఉన్నవారంతా ఎగిరి చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయారు. గాయపడ్డవారిని సంగారెడ్డి గవర్నమెంట్​ హాస్పిటల్​కు తరలించి వైద్యం అందిస్తున్నారు. తమ గ్రామానికి చెందిన ఇద్దరు చనిపోవడం, 16 మంది గాయపడటంతో చౌటకూర్​లో విషాదం నెలకొంది. కాగా బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. టెంపరరీ డ్రైవర్​కు మాత్రం స్వల్పంగా గాయాలయ్యాయి.

మిన్పూర్​లో మరో ప్రమాదం

సంగారెడ్డి–-సింగూర్‌ రహదారిపై మిన్పూర్​ సమీపంలోఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ఓ ఆటోను ఢీకొట్టింది. సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో పుల్కల్​ మండలం కోడూర్​కు చెందిన పెద్దబాగు యాదయ్య (38) అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరు గాయపడ్డారు. బస్సు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు.

తాగి బస్సు నడిపిన డ్రైవర్​పై దాడి

హైదరాబాద్–2 డిపోకు చెందిన బస్సు నిజామాబాద్​ జిల్లా పిట్లంకు వెళ్తుండగా.. అదే రూట్లో ముందు వెళ్తున్న ఏపీలోని కాకినాడ డిపోకు చెందిన సూపర్​ లగ్జరీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. కూకట్​పల్లి వై జంక్షన్​ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో కొందరికి స్వల్పంగా గాయాలయ్యాయి. దీనిపై ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టెంపరరీ డ్రైవర్​ మద్యం తాగిన మత్తులో ఉండటంతో ప్రమాదం జరిగిందంటూ మండిపడ్డారు. డ్రైవర్​ను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ సమయంలో మూసాపేట నుంచి కూకట్​పల్లి వైజంక్షన్​ వరకు ట్రాఫిక్​ నిలిచిపోయింది.

కండక్టర్​ను ఢీకొట్టిన బస్సు..

కరీంనగర్  బస్టాండ్‌లో సమ్మెలో ఉన్న శంకరయ్య అనే కండక్టర్ ను బస్సు ఢీకొట్టడంతో స్వల్ప గాయాలయ్యాయి. దీంతో కార్మికులంతా ఆగ్రహించి, ఆ బస్సు నడిపిన తాత్కాలిక డ్రైవర్ ను అరెస్టు చేయాలని ధర్నాకు దిగారు. పోలీసులు కండక్టర్​ను ఆస్పత్రికి తరలించారు, డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు.

కాలుపైకి బస్ ఎక్కించిండు

నల్లగొండ జిల్లా హాలియా బస్టాండ్‌లో ఓ ప్రయాణికుడి కాలుపైకి డ్రైవర్‌ బస్సు ఎక్కించాడు. నల్గొండ టౌన్ చైతన్యపురి కాలనీకి చెందిన చంద్రకాంత్‌.. బస్సు దిగుతుండగా డ్రైవర్‌ ముందుకు పోనించాడు. దీంతో చంద్రకాంత్ కిందపడ్డాడు. బస్సు వెనుక చక్రాలు అతని కాలుపై నుంచి వెళ్లాయి. ఈ ప్రమాదంలో అతని కాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రి తరలించారు.