చైనా ఓపెన్‌‌లో సైనాకు చుక్కెదురు

చైనా ఓపెన్‌‌లో సైనాకు చుక్కెదురు

చాంగ్జౌ (చైనా): చైనా ఓపెన్‌‌లో ఇండియాకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ నెగ్గిన ఉత్సాహంలో ఉన్న పీవీ సింధు ఒలింపిక్‌‌ మాజీ చాంప్‌‌ లీ జురుయ్‌‌కు చెక్‌‌ పెట్టి బోణీ కొట్టగా.. మరో టాప్‌‌ షట్లర్‌‌ సైనా నెహ్వాల్‌‌  ఫస్ట్‌‌ రౌండ్‌‌లోనే ఓడి నిరాశ పరిచింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌‌లో  ఐదో సీడ్‌‌ సింధు 21–18, 21–12తో వరుస సెట్లలో లీ జురుయ్‌‌ (చైనా)ను ఓడించి రెండో రౌండ్‌‌లో అడుగుపెట్టింది.

ఎనిమిదో సీడ్‌‌ నెహ్వాల్‌‌ 10–21, 17–21తో   19వ ర్యాంకర్‌‌ బుసానన్‌‌ (థాయ్‌‌లాండ్‌‌) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌‌ ఫస్ట్‌‌ రౌండ్‌‌లో సాయి ప్రణీత్‌‌ 21–19, 21–23, 21–14తో సుపాన్యు (థాయ్‌‌లాండ్‌‌)పై పోరాడి గెలిచాడు. మరో మ్యాచ్‌‌లో కశ్యప్‌‌ 21–12, 21–15తో  బ్రైస్‌‌ లెవర్డెజ్‌‌ (ఫాన్స్‌‌)పై  నెగ్గాడు. డబుల్స్‌‌ తొలి రౌండ్‌‌లో సుమీత్‌‌ రెడ్డి–మను అత్రి జంట 12–21, 15–21తో రెండో సీడ్‌‌ అసన్‌‌–సెతైవాన్‌‌ (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడింది.

మిక్స్‌‌డ్‌‌లో ప్రణవ్‌‌ చోప్రా–సిక్కి రెడ్డి ద్వయం 12–21, 21–23తో మార్క్‌‌ లాంఫస్‌‌–ఇసాబెల్‌‌ (జర్మనీ) జంట చేతిలో పరాజయం పాలైంది. మహిళల డబుల్స్‌‌లో అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి జోడీ 21–13, 11–8తో లీడ్‌‌లో ఉండగా ప్రత్యర్థి జంట చెంగ్‌‌ చి యా–లీ చి చెన్‌‌ (తైపీ) రిటైర్‌‌ కావడంతో సెకండ్‌‌ రౌండ్‌‌కు చేరుకుంది.