హెచ్‌సీఏపై సుప్రీంకోర్టు ఆగ్రహం

హెచ్‌సీఏపై సుప్రీంకోర్టు ఆగ్రహం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో రాజకీయాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అవకతవకలపై సీబీఐ దర్యాప్తు అవసరమని అభిప్రాయపడింది. అయితే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిని అడ్మినిస్ట్రేటర్ గా నియమించి... పూర్తి స్థాయి దర్యాప్తు జరిపిస్తామని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. మాజీ క్రికెటర్ మొహ్మద్ అజారుద్దీన్ అధ్యక్షుడిగా ఉన్న... హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో క్రికెట్ కంటే రాజకీయాలు ఎక్కువయ్యాయని సుప్రీంకోర్టు మండిపడింది. 

సుప్రీంకోర్టు మాజీ జడ్జ్ జస్టిస్ దీపక్ వర్మను అంబుడ్స్ మన్ కమ్ ఎథిక్స్ ఆఫీసర్ గా నియామకం అధ్యక్షుడు అజారుద్దీన్, అపెక్స్ కమిటీ మధ్య తీవ్ర వివాదానికి దారి తీసింది. జస్టిస్ దీపక్ వర్మ నియామకం కోసం అజర్  పట్టుబట్టగా.. మిగతా వాళ్లు వ్యతిరేకించారు. ఏప్రిల్ లో జరిగిన HCA- AGMలో సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. రసాభాసగా జరిగిన AGMలో జస్టిస్  దీపక్ వర్మను అంబుడ్స్ మన్ గా నియమిస్తున్నట్లు ప్రకటించి అజారుద్దీన్ వెళ్లిపోయాడు. అపెక్స్  కౌన్సిల్  సభ్యులు మాత్రం జస్టిస్  నిసార్  అహ్మద్  కక్రూను అంబుడ్స్ మన్ గా... జస్టిస్  మీనాకుమారిని ఎథిక్స్  అధికారి నియమిస్తున్నట్లు ప్రకటించారు. కొన్నాళ్లకు అంబుడ్స్ మన్ గా బాధ్యతలు స్వీకరించినట్లు జస్టిస్  దీపక్ వర్మ ప్రకటించడంతో అపెక్స్  కౌన్సిల్  మెంబర్లు కోర్టుకు వెళ్లారు. జస్టిస్  కక్రూ, జస్టిస్  మీనాకుమారిలను AGM నియమించిందని వాదించారు. అజారుద్దీన్ ను అపెక్స్  కౌన్సిల్  సస్పెండ్  చేసింది. అపెక్స్  కౌన్సిల్  మెంబర్లపై జస్టిస్ దీపక్ వర్మ వేటు వేశారు.  

HCA అంబుడ్స్ మన్ గా జస్టిస్ దీపక్ వర్మ నియామకాన్ని సస్పెండ్ చేస్తూ... హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఏప్రిల్ 6న హైకోర్టు కొట్టివేసింది. దీనిపై HCA, బడ్డింగ్ స్టార్ క్రికెట్ క్లబ్బులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాయి. చీఫ్ జస్టిస్ NV రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీల బెంచ్ నిన్న విచారించింది. ఇది సీరియస్ కేస్ అని... దీనిపై CBI దర్యాప్తు అవసరమన్నారు జడ్జీలు. HCAలోని రెండు వర్గాలను మేనేజ్ మెంట్ నుంచి తొలగిస్తామని బెంచ్ స్పష్టం చేసింది. అలాగే రిటైర్డ్ జడ్జీని అడ్మినిస్ట్రేటర్ గా అపాయింట్ చేస్తామన్నారు జడ్జీలు. ఆ అడ్మినిస్ట్రేటర్ నేతృత్వంలో... అవకతవకలపై నిష్పాక్షిక దర్యాప్తు జరుగుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన అక్రమాలకు రెండు వర్గాలు బాధ్యులేనని స్పష్టం చేసింది. క్రికెట్ అభివృద్ధి కంటే HCAలో రాజకీయాలు ఎక్కవయ్యాయని ఈ విషయంపై తాము సీరియస్ గా ఉన్నామని చీఫ్ జస్టిస్ NV రమణ నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. 

అంబుడ్స్ మన్ గా అపాయింట్ అయిన జస్టిస్ దీపక్ వర్మ పదవీకాలం ఇప్పటికే పూర్తైంది. దీంతో అతను ఎలంటి నిర్ణయాలు తీసుకోకుండా... ఆర్డర్స్ ఇవ్వకుండా చూడాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. కేసును వచ్చే బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఆ లోపే అడ్మినిస్ట్రేటర్ గా నియమించే జడ్జీల పేర్లను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.