సముద్రానికి ఆక్సిజన్‌ కావాలి..

సముద్రానికి ఆక్సిజన్‌ కావాలి..

ప్లాస్టిక్‌ వాడకం పర్యావరణాన్ని ఏ విధంగా దెబ్బతీస్తుందో తెలిసిందే.  జలచరజీవులు.. ప్రాణం లేకుండా  ఒడ్డుకు కొట్టుకురావడం, వాటి కడుపుల్లోంచి కిలోలకొద్దీ ప్లాస్టిక్‌ సంచులు బయటపడుతున్న ఘటనలు చూస్తున్నాం. అయితే సముద్రంలో ఉండే జీవజాలానికే కాదు.. అందులో ఉండే ఒకరకమైన బ్యాక్టీరియాకు ముప్పు కలిగిస్తోంది ఓషన్‌ ప్లాస్టిక్‌.  అది మానవాళి మనుగడను ప్రమాదం అంచుల్లోకి నెడుతోంది. ఇంతకీ ఆ బ్యాక్టీరియాకు.. మనిషి బతకడానికి సంబంధం ఏంటంటారా?.. మనిషి పీల్చుకునే గాలిలో పది శాతం ఆక్సిజన్‌ ఆ బ్యాక్టీరియా నుంచే ఉత్పత్తి అవుతోంది కాబట్టి…

మెరీనా ట్రెంచ్‌.. సముద్రాల్లోకెల్లా అత్యంత లోతైన ప్రాంతం. ఇక్కడ పదివేల కిలోమీటర్ల లోతులో పేరుకుపోయిన ప్లాస్టిక్‌పై  సిడ్నీకి చెందిన  మెకరీ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. అప్పుడుగానీ తెలీలేదు సమస్య ఎంత తీవ్రంగా ఉందోనని.  ‘ప్రోక్లోరోకకస్‌ బ్యాక్టీరియా(సయానో బ్యాక్టీరియా)’.. సముద్రంలో ఉండే  జీవజాతులకు ఆహారం ఏర్పరచడంలో, భూవాతారణంలోకి ఆక్సిజన్‌ విడుదల కావటంలో కీలకపాత్ర పోషిస్తుంది.  సముద్రతీరంలో ప్లాస్టిక్‌ డంప్‌ చేసినప్పడు ఆ ప్లాస్టిక్‌ వ్యర్థాలు.. ఎండకు ఎండి, వానకు తడిచి, బలమైన గాలులకు, సూర్యరశ్మికి గురై, చిన్న చిన్న ముక్కలుగా మారతాయి. ముక్కలుగా మారి ప్లాస్టిక్‌ వ్యర్థం(విష రసాయనాలు) సముద్రంలో కలుస్తుంది. తద్వారా ప్రోక్లోరోకకస్‌ బ్యాక్టీరియా అంతమవుతోంది. అయితే ఆ పరిస్థితి ఊహించిన దానికంటే ఎక్కువే ఉందని పరిశోధకులు చెప్తున్నారు.  చేపలు, తాబేళ్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బతినడానికి ప్రధాన కారణం కూడా ఇదేనని అంటున్నారు. ముందు ముందు పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆక్సిజన్‌ శాతం తగ్గిపోయే ప్రమాదం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

సీఫుడ్ప్లాస్టిక్వల్లే
తీర ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఎక్కువగా చేరుతోంది సీఫుడ్‌ పరిశ్రమల నుంచే. అందుకే తీరప్రాంత పరిశ్రమల్లో ప్లాస్టిక్‌ వాడకాన్ని అరికట్టాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఈయూ దేశాలు, బ్రిటన్‌ కఠిన చట్టాలతో ఆ సమస్యను కొంత వరకు తగ్గించాయి. మిగతా దేశాలు కూడా  దీనిపై చట్టాలు తీసుకురావాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.  మరోవైపు సముద్రంలో పేరుకుపోయిన టన్నుల కొద్దీ ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించేందుకు టెక్నాలజీ సాయం అందించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారని, స్పందించాల్సింది ప్రభుత్వాలేనని మేధావులు చెబుతున్నారు. ‘‘ఫలానా వాళ్ల ‘ఉప్పు తింటున్నాం..’ అని  డైలాగులతో విశ్వాసం చాటుకుంటాం. కానీ, ఆ ఉప్పునిచ్చే సముద్రం పట్ల కృతజ్ఞత చూపించట్లేదు. ప్లాస్టిక్‌ను సముద్రంలో కలవకుండా జాగ్రత్త పడదాం. సముద్ర జీవజాలాన్ని కాపాడదాం’’ అని పర్యావరణవేత్తలు పిలుపు ఇస్తున్నారు.