- లైఫ్ సైకిల్ ఫండ్స్‌ను ప్రవేశపెట్టిన సెబీ
- కనీసం ఐదేళ్ల మెచ్యూరిటీ పీరియడ్‌తో అందుబాటులో..
- టార్గెట్ డేట్‌కు దగ్గరయ్యే కొద్దీ అసెట్ అలొకేషన్‌లో ఆటోమేటిక్‌గా మార్పు
- మొదట్లో స్టాక్స్‌లో 90 శాతం వరకు అలొకేషన్.. చివరిలో సేఫ్టీ అసెట్స్‌కు 90 శాతం
న్యూఢిల్లీ: చాలా మంది ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా టెన్షన్ పడుతుంటారు. అసెట్ అలొకేషన్ (ఎంత అమౌంట్ ఎందులో పెట్టాలి) మార్చాలా? ఈక్విటీల్లో ఎక్కువ పెట్టాలా? లేదా రిస్క్ తక్కువుండే డెట్, గోల్డ్ ఈటీఎఫ్‌లకు మారాలా? వంటి సందేహాలతో కంగారు పడుతుంటారు. వీరి ఆందోళనలను పోగొట్టేందుకు మార్కెట్ రెగ్యులేటరీ సెబీ కొత్త మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీ ‘లైఫ్ సైకిల్ ఫండ్స్’ను ప్రవేశపెట్టింది. ఫండ్ అలొకేషన్ ఆటోమేటిక్‌గా మారుతుంది. అందువలన టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు.
లైఫ్ సైకిల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయంటే?
లైఫ్ సైకిల్ ఫండ్స్ ఓపెన్ -ఎండెడ్ ఫండ్స్. అంటే ఎప్పుడైనా కొనొచ్చు. అమ్మొచ్చు. కానీ వీటికి మెచ్యూరిటీ టైమ్ ఉంటుంది. గ్లైడ్ పాత్ స్ట్రాటజీతో పనిచేస్తాయి. అంటే మెచ్యూరిటీ టైమ్ దగ్గర పడే కొద్దీ ఫండ్ అలొకేషన్‌లో మార్పు ఉంటుంది. రిటైర్‌మెంట్, హౌసింగ్, చైల్డ్ ఎడ్యుకేషన్ వంటి లాంగ్-టర్మ్ గోల్స్ కోసం బాగా ఉపయోగపడతాయి.
గడువు: ఐదేళ్ల నుంచి 30 ఏళ్ల వరకు (5 సంవత్సరాల మల్టిపుల్స్‌లో) మ్యూచువల్ ఫండ్ కంపెనీలు లైఫ్ సైకిల్ ఫండ్స్‌ను తీసుకురావొచ్చు. ఒక కంపెనీ ఒకేటైమ్‌లో గరిష్టంగా ఇలాంటి ఆరు యాక్టివ్ ఫండ్స్‌ను మేనేజ్ చేయొచ్చు. ఈ ఫండ్స్ పేరులో మెచ్యూరిటీ పీరియడ్ ఇయర్ కూడా ఉండాలి. ఉదా. లైఫ్ సైకిల్ ఫండ్ 2045 అని ఉండాలి.
గ్లైడ్ పాత్ స్ట్రాటజీ: మెచ్యూరిటీ ఇయర్ దగ్గర పడే కొద్దీ ఫండ్ ఆటోమేటిక్‌గా అసెట్ అలొకేషన్ మారుస్తుంది. మొదటిలో (లాంగ్ టెన్యూర్) ఈక్విటీ (స్టాక్స్)కి ఎక్కువ అమౌంట్ కేటాయిస్తారు. ఫండ్‌లో 65–-95 శాతం షేర్ల వైపు వెళుతుంది. ఉదాహరణకు 30 ఏళ్ల లైఫ్ సైకిల్‌లో ఇన్వెస్ట్ చేస్తే మొదటి పదేళ్లలో స్టాక్స్‌లో భారీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్ కంపెనీ బట్టి ఈ టైమ్‌లో తేడా ఉంటుంది. టైమ్ పీరియడ్ మధ్యలో హైబ్రిడ్ (ఈక్విటీ + డెట్) అసెట్స్‌కు ఎక్కువ అలొకేషన్ జరుగుతుంది. టార్గెట్ డేట్ దగ్గరికి వచ్చేసరికి డెట్ (బాండ్స్), గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్, ఇన్విట్ వంటి రిస్క్ తక్కువగా ఉండే అసెట్స్‌లో అలొకేషన్ 80–90 శాతం వరకు చేరుతుంది.
ఎగ్జిట్ లోడ్: ఫండ్స్ నుంచి ఎగ్జిట్ అయినప్పుడు మొత్తం అమౌంట్‌లో కొంత శాతాన్ని చార్జీ కింద కట్టాల్సి ఉంటుంది. దీనిని ఎగ్జిట్ లోడ్ అంటారు. లైఫ్ సైకిల్ ఫండ్స్ టార్గెట్ డేట్‌కు దగ్గరయ్యే కొద్దీ ఈ చార్జీ తగ్గుతుంది. లాంగ్-టర్మ్ ఇన్వెస్టింగ్‌ను ఎంకరేజ్ చేయడానికి సెబీ ఈ విధానాన్ని తీసుకొచ్చింది. మొదటి ఇయర్‌లో బయటకు వచ్చేస్తే 3శాతం వరకు, ఏడాది నుంచి రెండేళ్లలో2 శాతం, రెండేళ్ల నుంచి మూడేళ్లలో ఒక శాతం, ఆ తర్వాత జీరో ఎగ్జిట్ లోడ్ పడుతుంది. లైఫ్ సైకిల్ ఫండ్స్ కూడా సాధారణ ఫండ్స్ మాదిరే పనిచేస్తాయి. అందువలన సిప్ చేసుకోవచ్చు.
రిటైర్‌మెంట్ ఫండ్ లేనట్టే..
సెబీ సాల్యూషన్ -ఓరియెంటెడ్ స్కీమ్స్ అయిన రిటైర్‌మెంట్, పిల్లల ఫండ్స్‌ను నిలిపేసింది. లైఫ్ సైకిల్ ఫండ్స్ ద్వారా ఈ గోల్ -బేస్డ్ ఇన్వెస్టింగ్ సాధ్యమవుతుందని భావిస్తోంది. స్కీమ్‌లను ఈక్విటీ, డెట్, హైబ్రిడ్, లైఫ్ సైకిల్, ఇతర ఫండ్స్‌గా వర్గీకరించింది. ఇతర ఫండ్స్ కింద ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్), ఫండ్ ఆఫ్ ఫండ్స్ వస్తాయి. ఏప్రిల్ 1 నుంచి ఈటీఎఫ్‌ల ఫిజికల్ గోల్డ్, సిల్వర్ విలువను ఇండియాలోని స్పాట్ ధరల ఆధారంగా లెక్కించాలి. లండన్ బులియన్ మార్కెట్ ఆధారంగా, వివిధ చార్జీలు వేసి కాదు.
