రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి న్యాయస్థానాల్లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తన లోన్ అకౌంట్‌ను 'ఫ్రాడ్'గా వర్గీకరించాలన్న బ్యాంకుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించడానికి నిరాకరించింది. బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ.. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
ఏమిటీ వివాదం?
అనిల్ అంబానీకి చెందిన లోన్ అకౌంట్లను 'ఫ్రాడ్'గా ప్రకటించేందుకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌తో సహా మరో రెండు బ్యాంకులకు బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ గతంలో అనుమతినిచ్చింది. అంతకుముందు 2025 డిసెంబర్‌లో ఒక సింగిల్ జడ్జి బెంచ్ అంబానీకి అనుకూలంగా మధ్యంతర ఉపశమనం ఇస్తూ స్టే విధించింది. తాజాగా డివిజన్ బెంచ్ ఆ స్టేను ఎత్తివేయడంతో అనిల్ అంబానీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు నిర్ణయానికే మొగ్గు చూపడంతో.. బ్యాంకులు ఇప్పుడు ఆయన ఖాతాను అధికారికంగా 'ఫ్రాడ్'గా ప్రకటించేందుకు వీలు ఏర్పడింది.
విచారణ స్పీడ్ పెంచమని ఆదేశం..
అనిల్ అంబానీ తరఫు న్యాయవాదులు బ్యాంకులతో సెటిల్మెంట్ చేసుకుంటామని కోర్టుకు చెప్పినప్పటికీ.. ధర్మాసనం దానిపై ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. అయితే ఈ వివాదానికి సంబంధించిన అసలు సివిల్ సూట్ ఇంకా హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, దాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు కోరింది. ఒకవేళ పిటిషనర్‌కు చట్టపరంగా ఇతర మార్గాలు ఏవైనా ఉంటే వాటిని వాడుకోవచ్చని సూచించింది.
►ALSO READ | హైవేలపై ప్రయాణించే వారికి హెచ్చరిక: మీ పాత FASTag బ్లాక్‌లిస్ట్ కావచ్చు.. వెంటనే ఇది చెక్ చేసుకోండి
ఉచ్చు బిగిస్తున్న దర్యాప్తు సంస్థలు..
రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్‌లో జరిగిన ఆర్థిక అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉచ్చు బిగిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఈడీ ఒక సిట్ ఏర్పాటు చేసినట్లు కోర్టుకు తెలిపింది. ప్రాజెక్ట్ హెల్ప్ పేరుతో దాదాపు రూ.2వేల 983 కోట్ల క్లెయిమ్‌లను కేవలం రూ.26 కోట్లకు సెటిల్ చేశారని, ఇందులో భారీ కుంభకోణం జరిగిందని ఈడీ అనుమానిస్తోంది. సీబీఐ కూడా రంగంలోకి దిగి ఇప్పటికే 7 కేసులను విచారిస్తోంది. మొత్తం రూ.73వేల 006 కోట్ల మేర క్లెయిమ్‌లపై విచారణ సాగుతోందని, ఇందులో ప్రభుత్వ అధికారుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నామని సీబీఐ కోర్టుకు వెల్లడించింది. దీంతో అనిల్ అంబానీకి అటు బ్యాంకులు, ఇటు దర్యాప్తు సంస్థల నుంచి గడ్డు కాలం మొదలైందని స్పష్టమవుతోంది.

