126 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

126 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

ముంబై : స్టాక్​మార్కెట్లు మంగళవారం కొద్ది లాభాలతో సరిపెట్టుకున్నాయి. బ్యాంకింగ్, ఐటి  ఫార్మా స్టాక్‌‌లకు బలమైన డిమాండ్ కనిపించింది. రూపాయి విలువ క్షీణించడం, విదేశీ నిధుల తరలింపుల వల్ల లాభాలు పరిమితంగా ఉన్నాయని ట్రేడర్లు తెలిపారు. బీఎస్‌‌ఈ సెన్సెక్స్ 126.41 పాయింట్లు పెరిగి 61,294.20 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో గరిష్టంగా 61,343.96  స్థాయిని తాకింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 35.10 పాయింట్లు లాభపడి 18,232.55 వద్ద ముగిసింది. సెన్సెక్స్ గెయినర్స్ చార్ట్‌‌లో యాక్సిస్ బ్యాంక్ 2.25 శాతం వృద్ధి చెందగా, టైటాన్, టీసీఎస్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో  నెస్లే ఇండియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, ఎన్​టీపీసీ 1.13 శాతం వరకు తగ్గాయి.  బీఎస్‌‌ఈ మిడ్‌‌క్యాప్ గేజ్ 0.22 శాతం,  స్మాల్‌‌క్యాప్ ఇండెక్స్ 0.18 శాతం పెరిగింది. సెక్టోరల్ ఇండెక్స్‌‌లలో కన్స్యూమర్ డ్యూరబుల్స్ 1.56 శాతం, హెల్త్‌‌కేర్ 0.67 శాతం, ఐటీ (0.65 శాతం), ఫైనాన్షియల్ సర్వీసెస్ (0.64 శాతం), బ్యాంకెక్స్ (0.58 శాతం), టెక్ (0.53 శాతం) చొప్పున పెరిగాయి. కమోడిటీస్‌‌, ఎఫ్‌‌ఎంసీజీ, ఆటో, మెటల్‌‌ నష్టాలను చవిచూశాయి. ఆసియాలోని షాంఘై,  హాంకాంగ్‌‌లోని ఈక్విటీ మార్కెట్లు లాభాలను సాధించగా, సియోల్ దిగువన ముగిసింది. మిడ్ సెషన్ డీల్స్‌‌లో యూరప్‌‌లోని ఈక్విటీ ఎక్స్ఛేంజీలు గ్రీన్‌‌లో ట్రేడవుతున్నాయి. సోమవారం అమెరికా మార్కెట్లు పనిచేయలేదు. అంతర్జాతీయ చమురు బెంచ్‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌‌కు 0.34 శాతం పెరిగి 86.20 డాలర్లకు చేరుకుంది.  డాలర్‌‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు తగ్గి 82.86 (తాత్కాలిక) వద్ద స్థిరపడింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌ఐఐలు) సోమవారం   రూ. 212.57 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.