హక్కుల చుక్కాని బాలగోపాల్ 14వ వర్ధంతి సంస్మరణ సభలో వక్తలు

హక్కుల చుక్కాని బాలగోపాల్  14వ వర్ధంతి సంస్మరణ సభలో వక్తలు

హైదరాబాద్, వెలుగు: ఆదివాసీలు, దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి బాలగోపాల్ అని పలువురు వక్తలు అన్నారు. నిర్బంధించినా.. దాడులు చేసినా.. సమాజంలో మనుషులందరికీ సమాన హక్కులు కావాలని పోరాడిన హక్కుల చుక్కాని.. ఆయన అని కొనియాడారు. వాకపల్లి గిరిజన మహిళలకు అండగా నిలిచిన తీరును వక్తలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మానవ హక్కుల నేత బాలగోపాల్ 14వ వర్ధంతి సందర్భంగా ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ ప్రతీక్ సిన్హా మాట్లాడారు. ఇండియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాను ప్రభుత్వం కంట్రోల్ చేస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన సంస్థలపై సీబీఐ, ఈడీతో దాడులు చేయిస్తున్నదన్నారు. 

సోషల్ మీడియా యాజమాన్యాలు కుడా తమ వ్యాపార విస్తరణ కోసం ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ ప్రభుత్వానికి సహకరిస్తున్నాయని ఆరోపించారు. మణిపూర్​లో కుకీ, మైతేయి తెగల మధ్య పూడ్చలేని అగాధానికి ప్రభుత్వమే కారణమని హెచ్​సీయూ ప్రొఫెసర్ ఖామ్ ఖాన్ సువాన్ సింగ్ ఆరోపించారు. మణిపూర్ ఘటనలు ప్రపంచం ముందు ఇండియా తలదించుకునేలా చేశాయని విమర్శించారు. డెవలప్​మెంట్ అంటే ప్రాజెక్ట్​లు కట్టడం మాత్రమే కాదని.. పరిపాలన, సామాజిక, ఆర్థిక రంగాల అభివృద్ధి కూడా అని మానవ హక్కుల వేదిక నేత ఎస్.తిరుపతయ్య అన్నారు. పదేండ్ల తెలంగాణలో దాదాపు 9కోట్ల మంది భూ నిర్వాసితులు ఉన్నారని, అందులో 40శాతం మంది గిరిజనులే అని తెలిపారు. మానవ హక్కుల వేదిక ఆవిర్భావం, పోరాటాలు, బాలగోపాల్​తో ఉన్న అనుబంధాన్ని వేదిక నేత చంద్రశేఖర్ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఫాసిజం, వాకపల్లి బుక్ లను వక్తలు రిలీజ్ చేశారు. తర్వాత బాలగోపాల్ మీద 30 నిమిషాల డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కత్తి పద్మ, ప్రొ.హరగోపాల్, కె.శ్రీనివాస్, కోదండరాం తదితరులు పాల్గొన్నారు.