ఏక్ నాథ్ షిండే శిబిరానికి చెందిన శివసేన ఎమ్మెల్యే సంతోష్ బంగర్ రెచ్చిపోయారు. మధ్యాహ్న భోజన కార్యక్రమంలో భాగంగా కూలీలకు నాసిరకం ఆహారం అందించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటరింగ్ సర్వీస్ మేనేజర్ పై ఎమ్మెల్యే దాడి చేశారు. అంతటితో ఆగకుండా అతనిపై తీవ్ర దుర్భాషలాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో మధ్యాహ్న భోజన కార్యక్రమంలో భాగంగా కూలీలకు అందించిన ఆహారం నాణ్యత లేదని ఎమ్మెల్యేకు కూలీలు ఫిర్యాదు చేశారు. వెంటనే బయల్దేరి కూలీలకు ఆహారం అందించిన సైట్‌ను సందర్శించానని ఎమ్మెల్యే చెప్పారు.
హింగోలికి చెందిన శివసేన ఎమ్మెల్యే జులైలో మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షకు కొద్ది నిమిషాల ముందు షిండే క్యాంపులో చేరారు. వెంటనే సేన నాయకత్వం మిస్టర్ బంగర్‌ను హింగోలి జిల్లా అధ్యక్ష పదవి నుండి తొలగించింది. హింగోలిలోని కలమ్నూరి నుంచి 2019 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మిస్టర్ బంగర్ గెలిచారు.
