ఏడుపాయల్లో శివరాత్రి జాతర

ఏడుపాయల్లో శివరాత్రి జాతర

పది లక్షల మంది భక్తులు
వస్తారని అంచనా
150 స్పెషల్​ బస్సులు
నడుపుతున్న ఆర్టీసీ

మెదక్‌‌/పాపన్నపేట, వెలుగు: మహాశివరాత్రి పర్వదినమైన శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు మెదక్‌‌‌‌ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల్లో జరిగే జాతరకు జిల్లా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. జాతరకు సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు.

మోటర్లతో నీళ్లు పంపింగ్​

వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి ప్రవాహం లేక మంజీరా నదీపాయలు బోసిపోతున్నాయి. ఎండోమెంట్​అధికారులు ఘనపూర్​ ఆనకట్ట పై భాగంలో మంజీరా నదీ మడుగుల్లో మోటర్లు ఏర్పాటు చేసి ఉన్న కాస్త నీటిని పైపులతో మంజీరా నదీ పాయలకు పంపింగ్​ చేస్తున్నారు. ఇలా ఘనపూర్​ఆనకట్ట దిగువన ఓ నదీ పాయమీద ఉన్న చెక్​డ్యామ్​ నింపారు. అక్కడి నుంచి ఆలయం ముందు నదీపాయకు నీటిని విడుదల చేయనున్నారు.

భారీ పోలీసు బందోబస్తు

జాతర ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇద్దరు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 63 మంది ఎస్సైలు, 117 మంది ఏఎస్సైలు, 300 మంది కానిస్టేబుళ్లు, 80 మంది మహిళా కానిస్టేబుళ్లు, 40 మంది స్పెషల్​ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎండోమెంట్​ డిపార్ట్​మెంట్​ఆధ్వర్యంలో 45 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే సిబ్బందికి 70 వాకీటాకీలు సమకూర్చారు.

150 బస్సులు

ఏడుపాయల జాతరకు ఉమ్మడి మెదక్‌‌‌‌ జిల్లాతోపాటు పొరుగు జిల్లాలు, ప్రధానంగా హైదరాబాద్‌‌‌‌, సికింద్రాబాద్‌‌‌‌నుంచే కాక కర్నాటక, మహారాష్ట్రల నుంచి  పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు 150 స్పెషల్‌‌‌‌ బస్సులను నడిపేలా ప్లాన్​ చేశారు. హైదరాబాద్  ఎంజీబీఎస్, సికింద్రాబాద్​ జేబీఎస్, బాలానగర్, నర్సాపూర్, మెదక్​ పాత, కొత్త బస్టాండ్​ల వద్ద ప్రత్యేక  జాతర బస్​ పాయింట్​లు ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా వైద్యారోగ్యశాఖ 32 మంది డాక్టర్లు, 64 మంది సూపర్​ వైజర్లు, 83 మంది ఏఎన్​ఎంలు, 23 మంది హెల్త్​వర్కర్లు, 14 మంది ఫార్మాసిస్ట్​లు, 11 మంది ల్యాబ్​ అసిస్టెంట్లను అందుబాటులో ఉంచుతున్నారు.

వసతుల ఏర్పాటు

జాతరకు వచ్చే భక్తులు స్నానాలు చేసేందుకు వీలుగా ఘనపూర్‌‌‌‌ ఆనకట్ట వద్ద, నదీపాయల వెంట ఆర్ డబ్ల్యూఎస్ ​డిపార్ట్ మెంట్​ ఆధ్వర్యంలో 10 చోట్ల షవర్లు ఏర్పాటు చేశారు. తాగునీటి కోసం 70 చోట్ల నల్లా పాయింట్లు ఏర్పాటు చేసి ఒక్కో పాయింట్​ వద్ద నాలుగు నల్లాలు బిగించారు. ఏడుపాయల ప్రాంగణంలో కొన్ని పర్మినెంట్‌‌‌‌ మరుగుదొడ్లు ఉండగా అదనంగా మరో 330  టెంపరరీవి నిర్మించారు. ఎవరైనా నీటిలో పడితే రక్షించేందుకు గజ ఈతగాళ్లను రెడీగా ఉంచుతున్నారు. అగ్నిప్రమాదాలు జరిగితే మంటలార్పేందుకు ఫైరింజన్లతోపాటు మూడు బుల్లెట్‌‌‌‌లను అందుబాటులో ఉంచుతున్నారు. విద్యుత్తు అంతరాయాలు కలగకుండా ట్రాన్స్​కో ఆధ్వర్యంలో 16 ట్రాన్స్​ఫార్మర్లు,  అదనంగా 30 స్తంభాలు ఏర్పాటు చేశారు. పారిశుధ్య నిర్వహణకు దాదాపు 500 మంది పారిశుధ్య  సిబ్బందిని నియమించారు.

see also: భారతీయుడు2 షూటింగ్​లో ప్రమాదం

రీజినల్‌‌ రింగ్‌‌ రోడ్డు ఆగింది!

సర్కార్ ఫోకస్ : రిటైర్మెంట్​ ఏజ్​ 61