రాచకొండ గుట్టల్లో సింగభూపాలుని బొమ్మ

రాచకొండ గుట్టల్లో సింగభూపాలుని బొమ్మ
  • రాచకొండ భోగినీ మండపంలో సింగభూపాలుని బొమ్మ
  • గుర్రంపై సవారీ చేస్తున్నట్లుగా చెక్కిన 700 ఏండ్లనాటి చిత్రం 
  • వెలుగులోకి తెచ్చిన చరిత్రకారుడు ద్యావనపల్లి సత్యనారాయణ 

హైదరాబాద్, వెలుగు: సుమారు 700 ఏండ్ల క్రితం రాచకొండను పాలించిన రేచర్ల పద్మనాయక రాజు సర్వజ్ఞ సింగభూపాలుడి చిత్రం రాచకొండ గుట్టలపై వెలుగు చూసింది. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం రాచకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని భోగందాని గుట్టపై సింగ భూపాలుడు గుర్రంపై విహరిస్తున్నట్లుగా ఉన్న చిత్రాన్ని ప్రముఖ తెలంగాణ చరిత్రకారుడు డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ గుర్తించారు. సర్వజ్ఞ సింగభూపాలుడు ఓ భోగినిని పోషించడమేగాక ప్రత్యేకంగా రాచకొండలో నాట్య మండపం కట్టించి ఆమెతో నాట్య ప్రదర్శనలిప్పించినట్లు 'రసార్ణవ సుధాకరం' అనే నాట్యాలంకార పుస్తకం ద్వారా తెలుస్తోందని సత్యనారాయణ చెప్పారు. అంతకుముందు ఆలంకారికులు వేశ్యను సామాన్య స్ర్తీగా చూస్తే సింగభూపాలుడు తన రచనల్లో నాయికగా గుర్తించారని తెలిపారు. గుట్టపై ఉన్న భోగినీ మండపం వెనుక భాగంలో సింగ భూపాలుడు గుర్రంపై కూర్చుని విహరిస్తున్నట్లున్నగా ఉందని, బహుశా ఈ చిత్రాన్ని సింగభూపాలుడిపై ఉన్న అభిమానంతో భోగినే చెక్కించి ఉంటుందన్నారు. అరుదైన ఈ చిత్రాన్ని, భోగినీ మండపాన్ని  పరిరక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.