ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా  సంక్షిప్త వార్తలు

ఉత్తమ పోలీస్ స్టేషన్ గా సీరోల్

కురవి(సిరోలు), వెలుగు : మహబూబాబాద్ జిల్లా సిరోలు పోలీస్ స్టేషన్ రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈమేరకు మంగళవారం రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. సీరోల్ లో లా అండ్ ఆర్డర్, రికార్డుల మెయింటనెన్స్, శానిటేషన్ బాగుందని తెలిపారు. సిబ్బంది నిబద్ధతతో పనిచేస్తున్నారని కొనియాడారు. సీరోల్​కు ఉత్తమ ర్యాంక్ దక్కడం పట్ల జిల్లా పోలీసు యంత్రాంగం హర్షం వ్యక్తం చేసింది.

గ్రామాల అభివృద్ధిలో సర్కారు ముందంజ

ఎల్కతుర్తి, వెలుగు : గ్రామాల అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్​కుమార్ అన్నారు. మంగళవారం హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ తో కలిసి ఎల్కతుర్తి మండలంలో విస్తృతంగా పర్యటించారు. స్థానిక ఎంపీడీవో ఆఫీసులో 56 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. పలువురు బాధితులకు రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఎల్కతుర్తి నుంచి దామెర, గోపాల్ పూర్ నుంచి కొత్తపల్లి క్రాస్ రోడ్డు, కోతులనడుమ నుంచి గోపాల్ పూర్, తిమ్మాపూర్ నుంచి సీతంపేట వరకు బీటీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

భూ నిర్వాసితులకు ఇండ్ల పట్టాలు

మల్హర్, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలకేంద్రం తాడిచెర్ల పరిధిలోని కాపురం భూనిర్వాసితులకు ఎట్టకేలకు ఇండ్ల పట్టాలు అందాయి. మంగళవారం ఆర్డీవో శ్రీనివాస్ తొలివిడతలో భాగంగా డ్రా పద్ధతిన 52మందికి ఆర్ అండ్ ఆర్ ఇండ్ల పట్టాలు అందజేశారు. మిగిలిన వారికి కూడా త్వరలోనే పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇటీవలే తాడిచెర్ల జెన్కో ఓపెన్ కాస్ట్ డేంజర్ జోన్ పరిధిలో భూములు, ఆస్తులు కోల్పోయిన నిర్వాసితులను ప్రకటిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడదల చేయగా.. తాడిచెర్ల గ్రామపంచాయతీ ఆవరణలో 2817 మంది నిర్వాసితుల పేర్లను ఆఫీసర్లు చదివి వినిపించారు. ఆఫీసర్లు ప్రకటించిన నిర్వాసితుల వివరాల జాబితాలో సమస్యలు, అభ్యంతరాలుంటే 60 రోజుల్లోపు భూపాలపల్లి ఆర్డీవో ఆఫీసులో ఫిర్యాదు చేయాలని శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో జెన్కో ఎస్ఈ ముత్యాల రావు, ఎంపీపీ మల్హర్ రావు, తహసీల్దార్ జివాకర్ రెడ్డి, సర్పంచ్ సుంకరి సత్యనారాయణ ఉన్నారు.

రైతు గోస పట్టదా?

ఎనిమిదేండ్ల కేసీఆర్ పాలనలో రైతుల ఆత్మహత్యలు రెట్టిపు అయ్యాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతు ధర్నాలు, దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రూ.లక్ష రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదన్నారు. ధరణి వల్ల రైతులు పొలం పనులు వదిలి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని వాపోయారు. సబ్సిడీ విత్తనాలు, ఉచిత ఎరువులు మాటలకే పరిమితం అయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు.  

- వెలుగు నెట్ వర్క్

ఉప్పుగల్లు జీపీ సెక్రటరీ సస్పెన్షన్

జఫర్​గఢ్ ఎంపీడీవో, ఏపీవో, టీఏలకు షోకాజ్ నోటీసులు

అడిషనల్ కలెక్టర్ పర్యటనతో  హడలెత్తిన ఆఫీసర్లు

స్టేషన్ ఘన్ పూర్(జఫర్ గఢ్), వెలుగు : జనగామ అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ జఫర్ గఢ్ మండల పర్యటన.. ఆఫీసర్లను హడలెత్తించింది. ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడంతో ఉరుకులు, పరుగులు పెట్టారు. డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జీపీ సెక్రటరీని సస్పెండ్ చేయగా.. పలువురికి షోకాజ్ నోటీసులు అందాయి. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా స్టేషన్​ఘన్ పూర్, జఫర్ గఢ్ మండలాల్లోని పాంనూరు, ఉప్పుగల్లు, తీగారం గ్రామాల్లో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ ఆకస్మికంగా పర్యటించారు. ఉప్పుగల్లులో నర్సరీ, ప్లేగ్రౌండ్ ఏర్పాటు చేయకుండానే ఆఫీసర్లకు తప్పుడు రిపోర్టు ఇచ్చిన పంచాయతీ సెక్రటరీ ప్రశాంత్ ను సస్పెండ్ చేశారు. జఫర్​గఢ్ ఎంపీడీవో శ్రీధర్ స్వామి, ఉపాధి హామీ ఏపీవో రాజకరుణ, టీఏ కుమారస్వామికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అన్ని గ్రామాల్లో ప్లే గ్రౌండ్లు, నర్సరీలు, విలేజ్​పార్కులు ఏర్పాటు చేయాలన్నారు.


‘ముదిరాజులను గుండెల్లో పెట్టుకుంటున్నం’

పాలకుర్తి, వెలుగు: రాష్ట్రంలోని ముదిరాజులను ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తిలో ముదిరాజుల ఆధ్వర్యంలో జరిగిన పెద్దమ్మ తల్లి బోనాల వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ తో కలిసి  బోనమెత్తుకున్నారు. ముదిరాజులకు టూవీలర్లు, చెరువుల్లో ఉచిత చేప పిల్లలు, సొసైటీలకు లోన్లు అందజేస్తున్నామన్నారు. కుల సంఘాల భవనాలకు నిధులు కేటాయిస్తున్నామన్నారు.

కాటమయ్య జాతరలో మంత్రి..

పర్వతగిరి(సంగెం): వరంగల్ జిల్లా సంగెం మండలం చింతలపల్లిలో గౌడ కులస్తులు నిర్వహించిన కాటమయ్య జాతరలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. గౌడన్నల బాగోగులు తెలుసుకున్నారు. ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ సుదర్శన్​రెడ్డి తదితరులున్నారు.

హాస్టళ్ల సమస్యలు పరిష్కరించండి..

హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీలో హాస్టళ్ల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుకు వర్సిటీ స్టూడెంట్స్​విజ్ఞప్తి చేశారు. ఈమేరకు హనుమకొండ ఆర్ అండ్ బీ గెస్ట్​ హౌజ్​లో మంగళవారం మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ ఏడాది కేయూలో అడ్మిషన్​ పొందిన ఎస్​ఎఫ్​ సీ కోర్సుల స్టూడెంట్లకు హాస్టల్​ సౌకర్యాన్ని ఎత్తివేస్తూ వీసీ నిర్ణయం తీసుకున్నారన్నారు. 40 ఏండ్ల చరిత్ర ఉన్న పోతన హాస్టల్ ను పునరుద్ధరించకుండా అమ్మాయిలకు  కేటాయించే ప్రయత్నం చేస్తున్నారని, దానికి ఎలాంటి రక్షణ లేకపోవడంతో వారు కూడా వ్యతిరేకిస్తున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎస్​ఎఫ్​సీ విద్యార్థులకు హాస్టల్స్​ కేటాయించాలని, అలాగే వర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని  కోరారు. బీఎస్​ఎఫ్​ కేయూ అధ్యక్షుడు కళ్లేపల్లి ప్రశాంత్, స్టాలిన్ అఫ్రోజ్, వేణు, గణేశ్, శివ తదితరులున్నారు.

మహేశ్​ మృతికి ప్రభుత్వమే కారణం

మహాముత్తారం, వెలుగు: పోలీస్ ఈవెంట్లకు వెళ్లి, హఠాత్తుగా మృతి చెందిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారంకు చెందిన లింగమల్ల మహేశ్ కుటుంబాన్ని మంగళవారం బీజేపీ స్టేట్ లీడర్ చంద్రుపట్ల సునీల్​రెడ్డి పరామర్శించారు. మహేశ్​మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఈవెంట్స్​లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్లే మహేశ్ చనిపోయాడని ఆరోపించారు. మహేశ్ కుటుంబానికి రూ.50లక్షల పరిహారం. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. బీజేపీ  మండల అధ్యక్షుడు పిలుమరి సంపత్, లీడర్లు దుర్గం తిరుపతి,  పసుల శివ, మేడిపల్లి పూర్ణ చందర్,  నవీన్ నాయక్  పాల్గొన్నారు.

రూ.50లక్షల పరిహారం ఇవ్వాల్సిందే..

హనుమకొండ సిటీ: పోలీస్​ నియామకాల్లో పాల్గొని చనిపోయిన అభ్యర్థుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్​ గ్రేషియో చెల్లించాలని బీఎస్పీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు శనిగరపు రాజు డిమాండ్ చేశారు. పోలీస్​ నియామకాల్లో భాగంగా పెట్టిన 4 మీటర్ల లాంగ్ జంప్​, 1600 మీటర్ల రన్నింగ్ వల్ల ఇప్పటికే భానోతు రాజేందర్​, ముడుగుల సతీశ్​, లింగమల్ల మహేశ్​అనే ముగ్గురు అభ్యర్థులు చనిపోయారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. బాధితుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్​ చేస్తూ మంగళవారం కేయూ జంక్షన్​ లో బీఎస్పీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీస్​ ఈవెంట్స్​ విషయంలో కేసీఆర్​ వెంటనే స్పందించాలని, లేకపోతే నిరుద్యోగులే ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారన్నారు.