హనుమకొండ, వెలుగు : హనుమకొండ వడ్డేపల్లిలోని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, చిట్స్ రిజిస్ట్రార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో గురువారం సాయంత్రం ఏసీబీ ఆఫీసర్లు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సబ్ రిజిస్ట్రార్లు డబ్బులు ఇస్తేనే డాక్యుమెంట్లు డిస్పాచ్ చేస్తున్నారన్న ఫిర్యాదులు అందడంతో ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో అధికారులు సోదాలు చేశారు. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లోకి వచ్చిన ఏసీబీ ఆఫీసర్లు.. ఎవరూ బయటకు వెళ్లకుండా డోర్స్ క్లోజ్ చేసి ఎంక్వైరీ చేపట్టారు. సబ్ రిజిస్ట్రార్ -1 రాం నర్సింహారావు, సబ్ రిజిస్ట్రార్- 2 ఆనంద్ ఆఫీసుల్లో అనధికారికంగా సుమారు 20 మంది డాక్యుమెంట్ రైటర్లు 70 డాక్యుమెంట్లతో ఉన్నట్లు గుర్తించారు. వారి వద్ద ఉన్న రూ.45,500 సీజ్ చేశారు.
సబ్ రిజిస్ట్రార్లు డబ్బులు ఇస్తేనే రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఇస్తున్నారని, లేదంటే తమ వద్దే పెండింగ్ పెట్టుకుంటున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్ల వద్ద నాలుగు నెలల నుంచి 204 పెండింగ్‌లో ఉన్నట్లు తేల్చారు. అంతే కాకుండా తాము చెప్పిన వ్యక్తులకు డబ్బులు పంపాలని సబ్‌రిజిస్ట్రార్లు ఏజెంట్లకు మెసేజ్ పెట్టినట్లు గుర్తించారు. పూర్తి విచారణ అనంతరం కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ సాంబయ్య చెప్పారు. ఇదిలా ఉండగా.. ఏసీబీ ఆఫీసర్ల తనిఖీ సమయంలో చిట్స్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఎవరూ లేకపోవడం గమనార్హం. రిజిస్టర్‌లో అటెండెన్స్ వేసినప్పటికీ.. ఆఫీసులో ఎవరూ అందుబాటులో లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
