- డాక్యుమెంట్ రైటర్ల నుంచి సబ్రిజిస్ట్రార్ల ఖాతాకు ఏకంగా రూ.42 లక్షలు
- కమీషన్ ఇవ్వలేదని వందలాది డాక్యుమెంట్లు పెండింగ్
- కొన్నిచోట్ల డాక్యుమెంట్ రైటర్లే ఏజెంట్లు.. మరికొన్ని ప్రాంతాల్లో సపరేట్‌గా ఏజెంట్ల వ్యవస్థ
- సెల్ఫ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఉన్నా.. అవగాహన కల్పించడంలో ఫెయిల్
- స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇచ్చినా అమలుకాకుండా అడ్డుకుంటున్న యంత్రాంగం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ సాఫీగా జరగాలన్నా.. ఏదైనా డాక్యుమెంట్ బయటకు రావాలన్నా ప్రతిదానికీ ‘లెక్క’ ముట్టాల్సిందే! ‘చేయి తడిపితేనే సంతకం.. కమీషన్ ఇస్తేనే రిజిస్ట్రేషన్’ అనేలా పరిస్థితి తయారైంది. సర్కారు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా.. ‘నో ఏజెంట్ పాలసీ’ అంటూ నిబంధనలు తెచ్చినా.. క్షేత్రస్థాయిలో మాత్రం పైరవీకారులు, ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్ల రాజ్యమే నడుస్తున్నది.
ఒకవైపు అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తూ రూ.లక్షలు, కోట్లు దండుకుంటున్న ఆఫీసర్లు, ఇంకోవైపు అన్నీ సక్రమంగా ఉన్నా ఫిక్స్‌డ్ కమీషన్ చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం పరిపాటిగా మారింది. ఇక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను అధికార యంత్రాంగం పూర్తిగా అటకెక్కించింది. తాజాగా, హనుమకొండలో డాక్యుమెంట్ రైటర్ల నుంచి ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల వ్యక్తిగత ఖాతాలకు ఏకంగా రూ. 42 లక్షల మామూళ్లు మళ్లడం సంచలనంగా మారింది. డాక్యుమెంట్ రైటర్లతో కుమ్మక్కై, ఒక్కో రిజిస్ట్రేషన్‌కు భారీగా కమీషన్లు దండుకుంటున్న తీరు తీవ్ర చర్చకు దారితీసింది.
కమీషన్లు ముట్టని 402 డాక్యుమెంట్లను ఉద్దేశపూర్వకంగా పెండింగ్‌లో పెట్టడం సబ్రిజిస్ట్రార్ల అవినీతికి పరాకాష్టగా నిలుస్తున్నది. మరోవైపు ఇటీవల అత్యధికంగా ఏసీబీకి పట్టుబడుతున్న వారిలో ఎస్‌ఆర్‌ఓలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందే ఉంటున్నారు. గడిచిన ఏడాది కాలంలో పదుల సంఖ్యలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా.. అవినీతికి అడ్డుకట్టపడకపోగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ‘ఇట్స్ కామన్’ అనే పదం వినిపిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో మొత్తం 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. రాష్ట్రం
వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ 12 ఏండ్ల కాలంలో 95 శాతం ఎస్‌ఆర్‌ఓల్లో ఏసీబీ రెయిడ్స్ జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అధికారంలోకి వస్తే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పారదర్శకత పెంచుతామని, మధ్యవర్తుల ప్రమే యం లేకుండా చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు సందర్భాల్లో ‘నో ఏజెంట్ పాల సీ’ గురించి హెచ్చరించినా, సబ్ రిజిస్ట్రార్లు మాత్రం తమ పంథాను మార్చుకోవడం లేదు. ప్రతి కార్యాలయంలోనూ ‘మధ్యవర్తులకు ప్రవేశం లేదు’ అనే బోర్డులు దర్శనమిస్తున్నా, లోపల మాత్రం ఆ వ్యక్తులే చక్రం తిప్పుతున్నారు.
కొన్ని చోట్ల డాక్యుమెంట్ రైటర్లే ఏజెంట్లుగా వ్యవహరిస్తుంటే, మరికొన్ని ప్రాంతాల్లో ఎస్ఆర్ఓలు తమకు నమ్మకస్తులైన ప్రైవేటు వ్యక్తులను ‘కలెక్షన్ ఏజెంట్లు’గా నియమించుకున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం భావిస్తున్న సంస్కరణలను కిందిస్థాయి యంత్రాంగం ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కేవలం క్రయ విక్రయదారులు, సాక్షులను మాత్రమే అనుమతించాలని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) చెబుతోంది. డాక్యుమెంట్ రైటర్లు సైతం తమకు కేటాయించిన స్థలాల్లోనే ఉండాలని హైకోర్టు గతంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
రికార్డ్ రూమ్‌లలోకి గానీ, రిజిస్ట్రేషన్ టేబుల్స్ దగ్గరకు గానీ అనధికారిక వ్యక్తులు వెళ్లకూడదు. కానీ, చాలా కార్యాలయాల్లో సీన్ రివర్స్‌లో కనిపిస్తోంది. అధికారులు కుర్చీల్లో ఉండగా, వారికి పక్కనే ఏజెంట్లు కూర్చుని డాక్యుమెంట్లు సరిచూడటం నిత్యకృత్యమైంది. మధ్యవర్తులకు ప్రవేశం లేదని బోర్డులు పెట్టినప్పటికీ, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కలిగిన అధికారులే వాటిని అడ్డుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.
- వసూళ్ల కోసమే ప్రత్యేక వ్యవస్థ
ప్రభుత్వం పారదర్శకతను పెంచేందుకు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగానే స్లాట్ బుకింగ్ విధానం కూడా తీసుకువచ్చింది. దీంతో సామాన్యులు డాక్యుమెంట్ రైటర్లపై ఆధారపడకుండానే తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. అయితే, ఈ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చే వారికి సాంకేతిక కారణాలు చూపుతూ ఆలస్యం చేయడం, అదే డాక్యుమెంట్ రైటర్ల ద్వారా వస్తే నిమిషాల్లో పని పూర్తి చేయడం ఆనవాయితీగా మారింది.
అధికారులు ముందస్తుగానే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, స్పెషల్ ఫీజుల పేరుతో వేల రూపాయలు రిజిస్ట్రేషన్ల కోసం వసూలు చేస్తున్నారు. నియమ, నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు ఉన్నప్పటికీ, ఫైలును ముందుకు కదపకుండా పెండింగ్‌లో పెడుతూ క్రయ, విక్రయదారులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారు. డాక్యుమెంట్లలో చిన్నపాటి సాంకేతిక లోపాలు ఉన్నాయంటూ భయపెట్టడం, సర్వర్లు సరిగ్గా పనిచేయడం లేదని సాకులు చెబుతూ వసూళ్లకు పాల్పడుతున్నారు.
- పర్యవేక్షణ లేదు.. సీసీటీవీలు లేవు..
అవినీతిని అరికట్టేందుకు ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి లైవ్ ఫీడ్‌ను జిల్లా రిజిస్ట్రార్, ఐజీ కార్యాలయాలకు అనుసంధానించాలని నిబంధన ఉంది. ఎక్కడైనా అనధికారిక కదలికలు ఉంటే వెంటనే స్పందించాల్సి ఉంటుంది. కానీ, క్షేత్రస్థాయిలో ఈ నిఘా వ్యవస్థ కేవలం ప్రదర్శన వస్తువుగా మారింది. కెమెరాలు పని చేయకపోవడం లేదా కావాలనే వాటిని పక్కదారి పట్టించడం ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు.
ఎంట్రీ పాస్ విధానం, స్లాట్ ఉన్నవారిని మాత్రమే లోపలికి పంపే నిబంధనలు ఎక్కడా సక్రమంగా అమలు కావడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే సబ్ రిజిస్ట్రార్లు, సీనియర్ అసిస్టెంట్లు వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకొని అవినీతి సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు. గత 8 నెలల కాలంలోనే ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పటికీ, 20 మందికి పైగా ఎస్ఆర్‌ల ఇండ్ల పై దాడులు చేసినా అవినీతి తిమింగలాల తీరు మారడం లేదు.
ఏడాది కాలంలో 15 మంది ఎస్ఆర్ఓలు, సీనియర్ అసిస్టెంట్లు ఏసీబీకి చిక్కి జైలుకు వెళ్లినా, వ్యవస్థలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం కేవలం దాడులతో సరిపెట్టకుండా, శాఖాపరమైన ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. లైసెన్స్‌డ్ డాక్యుమెంట్ రైటర్ల ముసుగులో సాగుతున్న అక్రమ ఏజెంట్ దందాను పూర్తిగా నిషేధించాలనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
- ఇటీవల ఏసీబీ జరిపిన దాడులు ఇలా
మేడ్చల్ జిల్లాలో ఒక స్థిరాస్తి రిజిస్ట్రేషన్ కోసం రూ. 2.5 లక్షలు లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ రాఘవరావు పట్టుబడ్డారు. దీని వెనుక సబ్ రిజిస్ట్రార్ హస్తం ఉన్నట్టు తేలడంతో ఇద్దరిపై కేసు నమోదైంది.
రంగారెడ్డి జిల్లా గండిపేట ఎస్ఆర్ఓ కార్యాలయంలో సోదాలు నిర్వహించగా, ఎస్ఆర్ఓ టేబుల్ డ్రాయర్‌లో లెక్కల్లో లేని రూ. 4.80 లక్షల నగదు లభించింది. ఏజెంట్ల ద్వారా వచ్చిన డబ్బుగా నిర్ధారించి ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేశారు.
ఖమ్మం జిల్లాలో కొత్త లేఅవుట్ రిజిస్ట్రేషన్ల క్లియరెన్స్ కోసం రూ. 3 లక్షలు డిమాండ్ చేసిన ఎస్ఆర్ఓ, ఒక ప్రైవేట్ వ్యక్తిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
నల్గొండలో సర్కారు నిబంధనలను ఉల్లంఘించి, సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిన వారిని ఇబ్బంది పెడుతూ లంచం ఆశించిన ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు ఏసీబీకి దొరికిపోయారు.
నిజామాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనధికారికంగా కూర్చున్న ఇద్దరు ఏజెంట్లను, వారితో కుమ్మక్కైన సీనియర్ అసిస్టెంట్‌ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. వీరి వద్ద నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.
