హైదరాబాద్, వెలుగు: గ్రూప్-1 ఉద్యోగ నియామకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. దశాబ్దకాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఆర్థిక, సామాజిక ఇబ్బందులతో సతమతమైన నిరుద్యోగ యువతకు ఈ తీర్పు పెద్ద ఊరటనిస్తుందని పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదల చేసి, పరీక్షలు నిర్వహించి, కొద్ది నెలల్లోనే నియామక ప్రక్రియ పూర్తి చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నామన్నారు. ఈ ప్రక్రియలో అడ్డుతగిలిన దుష్టశక్తుల కుట్రలను ఛేదించి, యువతను రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములను చేశామని వెల్లడించారు.
టీజీపీఎస్సీ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, పూర్తి పారదర్శకంగా నియామకాలు నిర్వహించిన చైర్మన్‌తో పాటు సిబ్బందిని అభినందించారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరబోతున్న గ్రూప్-1 అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. నిరుద్యోగుల్లో వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తమ సంకల్పానికి దక్కిన గుర్తింపని పేర్కొన్నారు.
