మట్టిలోంచి మొలిచిన కవిత్వం.. బతుకులను అక్షరాలుగా మలిస్తేనే కవిత్వానికి అసలైన రుచి

మట్టిలోంచి  మొలిచిన కవిత్వం..  బతుకులను అక్షరాలుగా మలిస్తేనే కవిత్వానికి అసలైన రుచి

నేలకు నోరుంటే అది కవిత్వమై మాట్లాడుతది. మట్టికి మాట వస్తే అది మనిషి చరిత్రనే చెప్తది. అలాంటి మాటల్ని, కథల్ని, మనుషుల బతుకుల్ని అక్షరాలుగా మలిచినప్పుడే కవిత్వానికి మట్టివాసన వస్తది. చెరువు గాలి, రైతు చెమట, అమ్మ చేతి గోరుముద్ద, బతుకు పోరాటం.. ఇవన్నీ ఒక్కటై పలికినప్పుడే తెలంగాణ కవిత్వానికి అసలు రుచి వస్తది. అలాంటి నేల వాసనను, మనుషుల బతుకుల వేడిని, కాలం కడుపులో దాపెట్టుకున్న గాయాలను, గుండె నిండా మోసుకొచ్చిన కవితా సంపుటే డా. ముత్యంపేట గంగాధర్ రాసిన “ఈతబాయి”. 

ఈ పుస్తకం చదువుతుంటే కవితలు చదివినట్టు ఉండదు. తెలంగాణ పల్లెల్లో నడిచినట్టుంటది. ఆ మట్టి మనుషుల నవ్వులు, కన్నీళ్లు, పోరాటాలు, జ్ఞాపకాలు మన కండ్లముందే తిరుగుతయి. అందుకే “ఈతబాయి” అనేది కేవలం ఒక కవితా సంకలనం మాత్రమే కాదు. తెలంగాణ మట్టిమనిషి ఆత్మకథను అక్షరాల్లో నిలిపిన ఒక బతుకుచిత్రం.

తెలంగాణ బతుకును దూరం నుంచి చూసినవాళ్లు కాదు.. ఈ నేల గుండె చప్పుడును మనసారా విన్నవాళ్లే.. ఆ అనుభూతిని అక్షరాల్లో పలికించగలరు. గంగాధర్ కూడా అలాంటి కవే. ఆయన కవిత్వంలో కనిపించేది ఊహల ప్రపంచం కాదు.. అనుభవాల ప్రపంచం. అందుకే ఈతబాయిలోని ప్రతి కవిత ఒక భావాన్ని చెప్పడం కంటే, ఒక బతుకును మన ముందుంచే ప్రయత్నం చేస్తది.

“ఆకలికి సమయం ఎవడు నేర్పాడో! / వాయిదా లేకుండా అలారంలా మోగుతోంది/కూలిన మానవత గోడలు/ విరిగి, తెగిపడ్డ సమాజ సంబంధాలు / కుట్ర, స్వార్థ పరుల్లో / విసిరేసి, మిగిలిన / బండ చరితలు మావి.. అంటూ “ఆకలి” అనే కవితలో ఆకలి వెనుక దాగున్న అసమానతను, మనుషుల మధ్య తెగిపోతున్న బంధాలను, మానవత్వం కోల్పోతున్న సమాజాన్ని ఈ కవిత ద్వారా ప్రశ్నిస్తడు. బాధను చెప్పి ఊరుకోడు. ఆ బాధను తీర్చే పోరాటంలో తానే ఆయుధమైతానని ప్రకటిస్తడు. అందుకే ఇందులో వినిపించేది మనిషి ఆకలి కాదు. కాలంతో తలపడుతున్న బతుకు గొంతుక. 

“నాలుగు కూడళ్లలో / కూడు కోసం వెతికే / కుటిలం లేని దుబారా జీవులం”, “రోడ్డు ప్రక్క బొంగుల్లోనో / బస్టాండ్‌‌లోనో / మా రాజభవంతులు / దారి చౌరస్తాల్లోని బొమ్మలే / మాకు ఆత్మబంధువులు” అంటూ “మా చిరునామాలు” కవితలో నిరాశ్రయుల మనుగడను కళ్లకు కట్టినట్టు చూపిస్తడు. చిరునామా లేని బతుకులకు సమాజమే చిరునామా కావాల్సిన పరిస్థితిని గుర్తు చేస్తడు. 

ఈ కవితలో జాలి కోసం చేసే వేడుకోలు కనిపించదు కానీ.. సమాజం నిర్మించుకున్న అసమానతల మీద చేసే నిశ్శబ్ద నిరసనే వినిపిస్తది. మనం ప్రతిరోజూ చూసి కూడా చూడనట్టు దాటిపోయే జీవితాలను కవి మన ముందుకు తీసుకొచ్చి, మన మనసును నిలదీస్తడు. నిత్యజీవితంలో మన కంటికి సాధారణంగా కనిపించే వస్తువులను కూడా కవితా వస్తువులుగా మలుస్తడు. 

“అద్దాల పెట్టె” కవిత అందుకు మంచి ఉదాహరణ. “మట్టికుండను మింగిన అద్దాల పెట్టె...”, “మా అవ్వకు దాని పేరు అనరాక ఫీజ్ అంటది...” అనే పాదాలు కేవలం ఒక ఉపకరణాన్ని పరిచయం చేయడానికి రాసినవి కావు.. కాలం మారేకొద్దీ పల్లె జీవితం ఎలా మారిందో చెప్పే ప్రతీకలు. మట్టికుండ నుంచి అద్దాల పెట్టె వరకు వచ్చిన ఈ మార్పులో గ్రామీణ జీవితంలోకి చొరబడిన వినియోగ సంస్కృతిని, పాత-కొత్త విలువల మధ్య ఏర్పడిన సంఘర్షణను తెలంగాణ నుడికారంలో ఆవిష్కరిస్తడు.  

రచయిత సమాజంలోని వైరుధ్యాలను నేరుగా ప్రశ్నించే తీరు “మా ఇంటిపై జెండా.. ఎగురవేస్తాము” కవితలో మరింత పదునుగా కనిపిస్తది. “అయినా మేము భారతీయులమే.. మా ఇంటిపై జెండా ఎగురవేస్తాము” అనే పునరుక్తిని కవి మకుటంలా వాడుతూ, దేశభక్తి పేరుతో జరుగుతున్న ద్వంద్వ ప్రమాణాలను ఎండగడుతడు. రైతు కష్టాలు, వైద్య వ్యవస్థలోని వ్యాపార ధోరణి, మహిళలపై పెరుగుతున్న దారుణాలు, మనీతత్వం ముందు మానవత్వం ఓడిపోతున్న సామాజిక వాస్తవాలను ఒకే కవితలో వ్యంగ్యంతో పలికిస్తడు. 

ఇక్కడ జెండా ఒక జాతీయ చిహ్నంగా మాత్రమే కాకుండా విలువలు కోల్పోతున్న సమాజాన్ని నిలదీసే ప్రతీకగా మారింది. ఇందులో సామాజిక స్పృహ ఎంత బలంగా వినిపిస్తదో, అంతే లోతుగా తాత్విక చింతన కూడా కనిపిస్తది. “అప్పుడప్పుడు ఈశాన్యభూమికి వెళ్లి తీరాలి..” అంటూ మొదలయ్యే “శ్మశానం” కవిత అందుకు చక్కటి నిదర్శనం. 

“ముడతల మెదడులోని స్వార్థం విడువాలన్నా.. ఆశ, కోరిక చావాలన్నా..” అనే పాదాలు, శ్మశానాన్ని ఒక అంతిమ గమ్యంగా కాకుండా మనిషి అహంకారాన్ని, స్వార్థాన్ని కరిగించే జీవిత పాఠశాలగా చూపిస్తయి. జీవితంలో ఎన్ని హోదాలు వరించినా, ఎంత హంగులు, ఆర్భాటాలు చేసినా.. అవన్నీ చివరికి అక్కడే నిశ్శబ్దమైపోతాయనే సత్యాన్ని ఎంతో సరళంగా గుర్తు చేస్తడు. ఈ కవిత మరణం గురించి కాదు, మనిషి ఎలా బతకాలనే ప్రశ్న గురించి. 

సమాజాన్ని ప్రశ్నించిన అదే కవి, ఒక్కసారిగా తన బాల్యంలోకి జారుకుని పల్లె జ్ఞాపకాలను మన ముందుంచుతడు. ఆ జ్ఞాపకాలకు ప్రతీకగా నిలిచిన కవితే “ఈతబాయి.”“గీ ఎండాకాలం తాతీలు రాంగనే / మా ఊరి పెద్ద ఒర్రె పక్కనే నున్న / బుచ్చన్నతాత బాయి యాదికస్తది..” అంటూ మొదలయ్యే ఈ కవిత, ఒక బావిని మాత్రమే కాదు.. ఒక తరం బాల్యాన్ని, ఒక ఊరి సంస్కృతిని, కలిసిమెలిసి బతికిన జీవన విధానాన్ని తిరిగి కళ్లముందు నిలబెడుతది. 

ఈతలు నేర్చుకోవడం, ఆటలు ఆడుకోవడం, అల్లరి చేయడం, ఆకలేస్తే ఇంటి దారి పట్టడం.. ఇవన్నీ ఒక వ్యక్తి జ్ఞాపకాలుగా కాకుండా తెలంగాణ పల్లెల సామూహిక స్మృతులుగా రూపుదిద్దుకుంటయి. అందుకే ఈ కవిత మిగతా కవితలన్నింటినీ కలిపే ఒక జీవన ప్రతీకగా నిలుస్తది. ఆకలి నుంచి ఆత్మాన్వేషణ దాకా, పల్లె జ్ఞాపకాల నుంచి సామాజిక ప్రతిఘటన దాకా గంగాధర్ రాసిన ప్రతి అక్షరం చివరికి తెలంగాణ మట్టిమనిషి బతుకులోకే వచ్చి చేరుతది. 

కాబట్టే.. ఈ సంపుటికి “ఈతబాయి” అనే పేరు పెట్టి, దాన్ని కాలంతోపాటు కనుమరుగైపోతున్న తెలంగాణ జీవన సంస్కృతికి ప్రతీకగా మార్చారు. ఈతబాయి కవితల్లో మట్టివాసనను పదాల్లో బంధించడం, మాండలికాన్ని కవిత్వ భాషగా నిలబెట్టడం, సామాజిక స్పృహను జీవితానుభవంతో మేళవించడం.. ఈ మూడు లక్షణాలే ఈ సంపుటిని ప్రత్యేకంగా నిలబెడతయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘ఈతబాయి’ని చదవడం అంటే కవితలు చదవడం కాదు.. ఒక తరం బతుకును మళ్లీ తడిమి చూడడం! 

-  మ్యాడం అభిలాష్,కంటెంట్ రైటర్,టాల్ రేడియో-

గమనిక: లైఫ్​& లిటరేచర్​ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్​ ఐడీ
featureseditor@v6velugu.com