మోడీపై ఆరోపణలు.. లంక విద్యుత్ బోర్డు చైర్మన్ రాజీనామా

మోడీపై ఆరోపణలు.. లంక విద్యుత్ బోర్డు చైర్మన్ రాజీనామా

శ్రీలంకలో ఓ విద్యుత్ ప్రాజెక్టును అదానీ గ్రూప్ కు ఇచ్చేలా  దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సపై  భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఒత్తిడి చేశారంటూ సంచలన ఆరోపణలు చేసిన సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) చైర్మన్ ఎం.ఎం.సి. ఫెర్డినాండో  రాజీనామా చేశారు.  ఈనెల 10న (శుక్రవారం) శ్రీలంక ప్రభుత్వరంగ సంస్థల పార్లమెంటరీ కమిటీ సమావేశం వేదికగా ఫెర్డినాండో  చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.  ‘‘ఉత్తర శ్రీలంకలోని మన్నార్ పట్టణంలో ఉన్న 500  మెగావాట్ల  పవన విద్యుత్ ప్రాజెక్టును  భారత ప్రధానమంత్రి మోదీ ఒత్తిడి వల్లే అదానీ గ్రూపుకు ఇస్తున్నామని శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స నాతో చెప్పారు. రాజపక్సను మోదీ చాలా ఒత్తిడి చేశారట’’ అని ఆ సమావేశంలో ఫెర్డినాండో  వ్యాఖ్యానించారు.  

ఖండిస్తూ  రాజపక్స ట్వీట్..

అయితే  ఫెర్డినాండో వ్యాఖ్యలను ఖండిస్తూ మరుసటి రోజున (జూన్ 11న) శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స ట్వీట్ చేశారు.  ఆ ఆరోపణల్లో ఎలాంటి నిజమూ లేదని స్పష్టం చేశారు.  శ్రీలంక అధ్యక్ష కార్యాలయం కూడా ఈమేరకు ఖండిస్తూ సుదీర్ఘ  ప్రకటనను విడుదల చేసింది.  ఈనేపథ్యంలో సీఈబీ చైర్మన్  ఫెర్డినాండో  కూడా.. జూన్ 10న తాను చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు.  క్షమాపణలు చెప్పారు.  ‘‘ శ్రీలంక పార్లమెంటరీ కమిటీ చర్చ జరుగుతుండగా  కొందరు సభ్యులు అడిగిన ప్రశ్నలకు నేను భావోద్వేగానికి లోనై అటువంటి వ్యాఖ్యలు చేశాను’’ అని ఫెర్డినాండో  స్పష్టం చేశారు.  తాజాగా సోమవారం (జూన్ 13న) సీఈబీ చైర్మన్  పదవికి ఫెర్డినాండో రాజీనామాను  ఆమోదించినట్లు  శ్రీలంక విద్యుత్ శాఖ ప్రకటించింది.  ప్రస్తుతం సీఈబీ వైస్ చైర్మన్ గా ఉన్న   నళింద ఇల్లంగకూన్ .. చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించింది.