290కి పెరిగిన శ్రీలంక బ్లాస్ట్ మృతులు.. 24 మంది అరెస్ట్

290కి పెరిగిన శ్రీలంక బ్లాస్ట్ మృతులు.. 24 మంది అరెస్ట్

శ్రీలంక రాజధాని కొలంబోలో ఉగ్రవాదులు సృష్టించిన బీభత్సపు ఆనవాళ్లు ఒళ్లు గగుర్పొడిచే రీతిలో బయటపడుతున్నాయి. 8 వరుస పేలుళ్లలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. 3 చర్చ్ లు, 3 లగ్జరీ హోటల్స్ లో లో జరిగిన దాడుల్లో ఇప్పటివరకు 290 మంది చనిపోయినట్టు శ్రీలంక అధికారికంగా ప్రకటించింది. 500 మందికి పైగా గాయపడినట్టు చెప్పారు.

శ్రీలంకలో పేలుళ్లకు సంబంధించి బాధ్యతను ఇప్పటివరకు ఏ సంస్థా అధికారికంగా ప్రకటించుకోలేదు. చర్చ్ లు, హోటల్స్ లో పేలుళ్లకు పాల్పడ్డారని అనుమానిస్తూ మొత్తం 24 మందిని అరెస్ట్ చేసినట్టు శ్రీలంక పోలీసులు చెప్పారు. వీరికి వేరే దేశాలనుంచి ఏమైనా సహాయ సహకారాలు అందాయా అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

నిన్న పేలుళ్ల సందర్భంగా విధించిన కర్ఫ్యూను ఆ దేశ కాలమానం ప్రకారం ఈ ఉదయం ఆరు గంటల సమయంలో ఎత్తివేశారు. కర్ఫ్యూ సమయంలో.. ఆ దేశ జాతీయ రహదారులు, రాజధాని కొలంబో నిర్మానుష్యంగా కనిపిించాయి. శ్రీలంకలో హైఅలర్ట్ కొనసాగుతోంది. సైన్యం బందోబస్తులో పాల్గొంటోంది.