సెంట్రల్‌‌ సర్వీసులు వద్దంటే వద్దు!

సెంట్రల్‌‌ సర్వీసులు  వద్దంటే వద్దు!

న్యూఢిల్లీ: రాష్ట్రాల్లో పనిచేసే పెద్దాఫీసర్లు డిప్యుటేషన్‌‌ కింద కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అస్సలు ఇష్టపడటం లేదు! అధికారులను సెంట్రల్‌‌ సర్వీసులకు నామినేట్‌‌ చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరినా స్పందన కన్పించడం లేదు. డిప్యూటీ సెక్రటరీ, డైరెక్టర్‌‌ స్థాయిల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉండిపోతున్నాయి. దీంతో అధికారులను డిప్యుటేషన్‌‌పై పంపాలని కేంద్రం తాజాగా మరోసారి రాష్ట్రాలను కోరింది. సెంట్రల్‌‌ విజిలెన్స్‌‌ కమిషన్‌‌ పరిధిలో పనిచేసే చీఫ్‌‌ విజిలెన్స్‌‌ ఆఫీసర్‌‌ పోస్టులతోటు ఇంకొన్ని స్థానాలకు అధికారులను పంపాల్సిందిగా కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ గత డిసెంబర్‌‌లో రాష్ట్రాలను కోరింది. అయితే ఆరు నెలలు గడిచినా స్పందన పెద్దగా లేదు. ‘డిప్యూటీ సెక్రటరీ/డైరెక్టర్‌‌/జాయింట్‌‌ సెక్రటరీ స్థాయిల్లో అధికారుల కొరత ఉంది. సెంట్రల్‌‌ స్టాఫింగ్‌‌ స్కీం కింద ఆఫీసర్లు సెంట్రల్‌‌ సర్వీసుల్లో చేరేలా చూడండి. ఈ స్కీం కింద పూర్తికాలం కేంద్ర సర్వీసులో పనిచేసే అధికారులను ఎక్కువగా నామినేట్‌‌ చేయండి. సిబ్బంది కొరతను కేంద్రం, రాష్ట్రాలు పంచుకుంటే బాగుంటుంది’’ అని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.

ఎక్కడ్నుంచి ఎంత మంది?

సెంట్రల్‌‌ డిప్యుటేషన్‌‌ స్కీం కింద ప్రతి రాష్ట్రం కొందరు అధికారులను కేంద్ర సర్వీసులకు నామినేట్‌‌ చేయాలి. ఇలా పశ్చిమబెంగాల్‌‌ 78 మంది ఐఏఎస్‌‌లను ఇవ్వాల్సి ఉంటే ఆ రాష్ట్రం నుంచి 8 మందే సెంట్రల్‌‌ సర్వీసుల్లో పనిచేస్తున్నారు. యూపీ నుంచి 134 మంది ఐఏఎస్‌‌లకు  44 మందే వెళ్లారు. కర్నాటక నుంచి 68 మందికి 20 మంది, ఛత్తీస్‌‌గఢ్‌‌ నుంచి 38 మందికి ఏడుగురు, మధ్యప్రదేశ్‌‌ నుంచి 90 మందికి 27, బీహార్‌‌ నుంచి 74 మంది ఐఏఎస్‌‌లకు 36, ఒడిశా నుంచి 51 మంది ఐఏఎస్‌‌లకు 20, గుజరాత్‌‌ నుంచి 64 మందికి 17, ఆంధ్రప్రదేశ్‌‌ 46 మంది ఐఏఎస్‌‌లకు 18 మంది సెంట్రల్‌‌ సర్వీసులకు వెళ్లారు.