ఎలక్షన్లు అయ్యాక అవినీతిపరులను జైలుకు పంపిస్తం: మోదీ

ఎలక్షన్లు అయ్యాక అవినీతిపరులను జైలుకు పంపిస్తం: మోదీ

జంషెడ్ పూర్(జార్ఖండ్)/పురూలియా(వెస్ట్ బెంగాల్): లోక్​ సభ ఎన్నికలు పూర్తయ్యాక అవినీతిపరులు అందరినీ జైలుకు పంపిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అవినీతిపరులను ఎవ్వరినీ వదిలిపెట్టబోమని, ఇది మోదీ గ్యారంటీ అని చెప్పారు. ఈమేరకు జార్ఖండ్​, బెంగాల్​లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీల్లో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై మోదీ ఫైర్ అయ్యారు. ‘‘కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీ యువరాజు మావోయిస్టులు మాట్లాడే భాషను వాడుతున్నారు. దీంతో ఆ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలంటే ఇండస్ట్రియలిస్టులు ఒకటికి 50 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. 

రాహుల్ భాష.. బలవంతపు వసూళ్లకు కొత్త పద్ధతిలా ఉంది” అని రాహుల్​ను ఉద్దేశించి ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాలను పెంచి పోషిస్తోందని, లోక్ సభ సీట్లను తమ పూర్వీకుల ఆస్తిగా భావిస్తోందని విమర్శించారు. ‘‘రాహుల్ గాంధీ అమేథీ నుంచి రాయ్ బరేలీకి పారిపోయి పోటీ చేస్తున్నారు. అది తన తల్లి సీటు అని అంటున్నారు” అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కనీస సౌకర్యాలను కల్పించలేదని, 18 వేల గ్రామాలు ఇంకా 18వ శతాబ్దం నాటి ఊర్లలానే ఉన్నాయన్నారు.

ఇండియా కూటమిలో అన్నీ అవినీతి పార్టీలే 

ఇండియా కూటమిలోని పార్టీలన్నీ అవినీతిలో కూరుకుపోయినవేనని ప్రధాని మోదీ చెప్పారు. జూన్ 4న తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిపరులందరినీ జైలుకు పంపుతామన్నారు. ‘‘మా, మాటి, మానుష్ (తల్లి, భూమి, ప్రజలు) అన్నది టీఎంసీ నినాదం. కానీ వాళ్లు ఈ నినాదాన్ని విస్మరించారు. సందేశ్ ఖాలీలో మహిళలను వేధించినవారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు” అని మోదీ ఆరోపించారు.

ఓటుబ్యాంకు కోసం సాధువులపై నిందలు.. 

కేవలం తమ ఓటు బ్యాంకును సంతృప్తిపర్చడం కోసం తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇస్కాన్, రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ సంఘం వంటి సంస్థలపై కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. ఇలాంటి సామాజిక, మత సేవా సంస్థలపై కూడా హద్దులు మీరి దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. ఆదివారం బెస్ట్ బెంగాల్​లోని పురూలియా, బిష్ణుపూర్ లలో జరిగిన ఎన్నికల ర్యాలీల్లోనూ ఆయన మాట్లాడారు. రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ సంఘంకు చెందిన కొందరు సాధువులు ఢిల్లీలోని బీజేపీ లీడర్ల కింద పని చేస్తున్నారంటూ మమత శనివారం ఓ ఎన్నికల సభలో చేసిన కామెంట్లను ఆయన తప్పుపట్టారు. ‘ఎన్నికల్లో ప్రజలను బెదిరిస్తూ వస్తున్న టీఎంసీ ఈసారి అన్ని హద్దులనూ దాటింది. 

ప్రపంచవ్యాప్తంగా తమ సేవా కార్యక్రమాలు, నైతికతతో ఇస్కాన్, రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ సంస్థలు ప్రసిద్ధి చెందాయి. మిలియన్ల మంది ఫాలోవర్లతో ప్రజలకు సేవ చేస్తున్న సంస్థలు. మమతా బెనర్జీ తమ ఓటు బ్యాంకును బుజ్జగించడం కోసం వాటిని బెదిరిస్తున్నారు” అని మోదీ ఆరోపించారు. కాగా, బెంగాల్ సీఎం మమత ఆరోపణలపై రామకృష్ణ మిషన్, భారత్​ సేవాశ్రమ్​ సంఘం ప్రతినిధులు స్పందించారు. ఏ పార్టీ తరఫున తాము ఓట్లు అభ్యర్థించలేదని ఆదివారం మీడియాకు వివరించారు.