ఫ్లైట్​లో చిన్నారికి గుండెపోటు.. 3 రోజుల తర్వాత ఆస్పత్రిలో మృతి

ఫ్లైట్​లో చిన్నారికి గుండెపోటు.. 3 రోజుల తర్వాత ఆస్పత్రిలో మృతి

నాగ్‌‌పూర్ : విమానంలో గుండెపోటుకు గురైన బంగ్లాదేశ్ చిన్నారి కథ విషాదాంతమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ చిన్నారి కన్నుమూసింది. మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన కిమ్స్-కింగ్స్‌‌వే హాస్పిటల్ ఈ విషయాన్ని వెల్లడించింది. మూడు రోజులు మృత్యువుతో  పోరాడి చివరకు గురువారం తెల్లవారుజామున 3.15 గంటలకు మరణించిందని అధికారులు ప్రకటించారు. మూత్రపిండాలు, గుండె వైఫల్యం సహా అనేక సమస్యలతో పసికందు బాధపడిందని తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది, డాక్టర్లు శిశువుకు మెరుగైన వైద్యం అందించారని.. అయినా చిన్నారిని కాపాడలేకపోయారని చెప్పారు. చిన్నారి మృతదేహాన్ని బంగ్లాదేశ్‌‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. 

అసలేం జరిగింది..! 

బెంగళూరు నుంచి- ఢిల్లీ బయలుదేరిన విస్తారా విమానంలో బంగ్లాదేశ్‌‌కు చెందిన 15 నెలల పసిపాప గుండెపోటుతో  స్పృహ తప్పి పడిపోయింది. విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురు డాక్టర్లు ఆ చిన్నారికి సీపీఆర్(కార్డియో పల్మనరీ రిససిటేషన్) అందించి ప్రాణాలు నిలబెట్టారు. పైలట్​ఆ విమానాన్ని నాగ్‌‌పూర్ కు మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్​చేశారు. ఆ చిన్నారిని కిమ్స్-కింగ్స్‌‌వే హాస్పిటల్ కు తరలించారు. మూడు రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారి గురువారం చనిపోయింది.