సిటీలో వెలుగని స్ట్రీట్​లైట్లు, హైమాస్ట్​ లైట్లు

సిటీలో వెలుగని స్ట్రీట్​లైట్లు, హైమాస్ట్​ లైట్లు

హైదరాబాద్, వెలుగు:  సిటీలో స్ట్రీట్​లైట్లు, హైమాస్ట్​ లైట్లు వెలుగుతలేవు. అవసరమైన ప్రాంతాల్లో బల్దియా అధికారులు వాటిని ఏర్పాటు చేయడం లేదు. దీంతో సాయంత్రం 6 దాటితే  మెయిన్ రోడ్లు మొదలుకొని పలు కాలనీలు, బస్తీలు చీకట్లోనే కనిపిస్తున్నాయి. గత వారం వరుస వానలతో పాటు స్ట్రీట్ లైట్లు పనిచేయక రాత్రివేళల్లో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు చాలా కాలనీలు, బస్తీల్లో స్ట్రీట్ లైట్లు వెలగకపోవడంతో దొంగతనాలు జరుగుతున్నట్లు పలు కాలనీల జనం చెప్తున్నారు. లైటింగ్ లేకపోవడంతో చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో క్లియర్​గా రికార్డ్ కావడం లేదంటున్నారు.  గ్రేటర్​లో 2 నుంచి5 శాతం స్ట్రీట్​ లైట్లు మాత్రమే పనిచేయడం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ దాదాపు 20 నుంచి 30 శాతం లైట్లు వెలగట్లేదని అంచనా. ప్రధాన జంక్షన్ల వద్ద ఉన్న హైమాస్ట్ లైట్లు కొన్ని నెలలుగా పనిచేయడం లేదు. టూరిస్ట్ స్పాట్స్​అయిన ట్యాంక్​బండ్, దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి తదితర ప్రాంతాలపై ఫోకస్ పెడుతున్న బల్దియా అధికారులు పబ్లిక్ ఉండే ఏరియాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. స్ట్రీట్ లైట్లు వెలగక వాన పడినప్పుడు చాలా చోట్ల యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. గ్రేటర్​లో రూ.217 కోట్ల12 లక్షలతో ఎల్ఈడీ లైట్లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి వీటిని టెక్నాలజీతో పరిశీలిస్తున్న అధికారులు 98 శాతం లైట్లు వెలుగుతున్నాయని చెబుతున్నప్పటికీ ఆ పరిస్థితి కనిపించడం లేదు.   ఈ ఏడాది  స్ట్రీట్​లైట్లపై ఎక్కువ  కంప్లయింట్లు  రావడంతో గ్రేటర్ పరిధిలో 17 బ్లాక్ స్పాట్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఆ ఏరియాల్లో  లైట్లను మాత్రం ఏర్పాటు  చేయడం లేదు. 

ఎక్కడా చీకటి లేకుండా చేస్తామని చెప్పి..
గ్రేటర్ పరిధిలో ఎక్కడా చీకటి లేకుండా చెస్తామని రెండేళ్ల క్రితమే చెప్పిన బల్దియా అధికారులు అందుకు సంబంధించిన పనులను చేయట్లేదు. రద్దీ తక్కువగా ఉండే బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో  లైట్లు లేకపోవడంతో సాయంత్రం వేళల్లో మహిళలు ఒంటరిగా బయటకు రాలేకపోతున్నారు. ఓయూ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా లైటింగ్ లేకపోవడంతో రాత్రివేళల్లో కుక్కలు దాడి చేస్తున్నట్లు స్థానిక బస్తీ వాసులు చెప్తున్నారు. ఉప్పల్ లోని ఆదర్శనగర్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, నాగోల్, లంగర్ హౌస్ పరిధి నానల్ నగర్, రేతిబౌలి, బంజారాహిల్స్, నాంపల్లి, రాజేంద్రనగర్ ఇలా చాలా ప్రాంతాల్లో మెయిన్ రోడ్లు, కాలనీల్లో లైట్లు వెలగక జనం ఇబ్బంది పడుతున్నారు. బంజారాహిల్స్​, జూబ్లీహిల్స్ లోనూ కొన్ని చోట్ల​మెయిన్ రోడ్లపై  ఏర్పాటు చేసిన  లైట్లు వెలగడం లేదు. బల్దియాకు వస్తున్న కంప్లయింట్లలో స్ట్రీట్ లైట్లకు సంబంధించినవే 20 నుంచి 30 శాతం ఉన్నట్లు సిబ్బంది చెప్తున్నారు. గతేడాది స్ట్రీట్ లైట్ సమస్యలపై 42 వేల కంప్లయింట్లు వచ్చాయన్నారు.