పోలీస్ స్టేషన్ లోనే గాజు ముక్కలు మింగి ఆత్మహత్యాయత్నం

పోలీస్ స్టేషన్ లోనే గాజు ముక్కలు మింగి ఆత్మహత్యాయత్నం

గాజు ముక్కలు మింగిన పాత నేరస్తుడు
విషమంగా పరిస్థితి

మిర్యాలగూడ, వెలుగు: పోలీసుల అదుపులో ఉన్న పాత నేరస్తుడు గాజు ముక్కలు మింగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. బాధితుడు, స్థానికుల వివరాల ప్రకారం… ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన సట్టు నాగేశ్వరరావు ఓ దొంగతనం కేసులో శిక్ష అనుభవించాడు. ఈ క్రమంలో పట్టణంలో కొద్దిరోజుల కింద జరిగిన చోరీ కేసు విషయమై 13 రోజుల క్రితం నాగేశ్వరరావును వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఉదయం మరుగుదొడ్డి కి వెళ్లిన నాగేశ్వరరావు బల్బును తీసుకుని గదికి వచ్చి ముక్కలుగా చేసి మింగాడు. గుర్తించిన పోలీసులు హుటాహుటిన మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించారు. ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడిన బాధితుడు విచారణ పేరుతో హింసిస్తున్నారని, పోలీసుల దెబ్బలకు తాళలేకనే ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పాడు. ఈ విషయమై మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేష న్ సీఐ సదా నాగరాజును వివరణ కోరగా సదరు వ్యక్తి పాత నేరస్తుడని, బైక్ అపహరణ కేసులో బుధవారమే అతనిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఆత్మహత్య యత్నం పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు.