గతం కాదు.. అయోధ్య సమస్య పరిష్కారంపైనే దృష్టి: సుప్రీంకోర్టు

గతం కాదు.. అయోధ్య సమస్య పరిష్కారంపైనే దృష్టి: సుప్రీంకోర్టు

న్యూ ఢిల్లీ : అయోధ్యలో మందిర్ – మసీద్ భూ వివాదం మధ్యవర్తిత్వం విషయంపై ఇవాళ సుప్రీం కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. సున్నీ వక్ఫ్ బోర్డ్ సహా ముస్లిం సంఘాలు మధ్యవర్తిత్వానికి అనుకూలమని తెలిపాయి. అయితే హిందూమహాసభ మాత్రం గతంలో మాదిరిగానే.. మధ్యవర్తిత్వానికి నో చెప్పింది. అయోధ్య వివాదంపై శాశ్వత పరిష్కారం కోసం సుప్రీం కోర్టు ప్రయత్నిస్తోంది. ఇవాళ కీలక నిర్ణయం వెలువడుతుందని అంతా ఆశించారు. అయితే పిటిషనర్లు విబేధించడంతో మధ్యవర్తిత్వంపై తీర్పును సుప్రీం ధర్మాసనం రిజర్వ్ లో పెట్టింది. ఇవాళ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.

వాదనల సమయంలో జస్టిస్ SA బాబ్డే.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది భూవివాదం మాత్రమే కాదని, మత విశ్వాసానికి, సెంటిమెంట్స్ కు సంబంధించిన విషయమన్నారు. ఎవరు కూల్చారు, మందిరమా, మసీదా అన్నది గత విషయమనీ… సమస్య పరిష్కారం కోసం.. ప్రస్తుత వివాదాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని పిటిషనర్లకు చెప్పారు న్యాయమూర్తి. సమస్య పరిష్కారానికి ఒక మధ్యవర్తి కంటే ప్యానెల్ అవసరమని భావిస్తున్నట్లు సుప్రీం తెలిపింది. మత విశ్వాసాలు, నమ్మకాలపై బేరసారాలు ఆడలేమని రామ్ లల్లా కౌన్సిల్ తెలిపింది. మధ్యవర్తుల పేర్లను పార్టీలు తెలపాలని సుప్రీం సూచించింది. దీనిపై త్వరలోనే ఆర్డర్ ఇస్తామన్నారు సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్.