మరికొన్ని గంటల్లో కూలనున్న ట్విన్ టవర్స్

మరికొన్ని గంటల్లో  కూలనున్న ట్విన్ టవర్స్

ఉత్తర ప్రదేశ్ నోయిడాలోని ట్విన్ టవర్స్ కూల్చివేతకు అంతా రెడీ అయ్యింది. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ట్విన్ టవర్స్ నేలమట్టం కానున్నాయి. 100 మీటర్ల ఎత్తున్న ఈ భారీ టవర్స్ ని తొమ్మిది సెకన్లలోనే కూల్చేయనున్నారు. దీనికోసం 3 వేల 500 కిలోల పేలుడు పదార్థాలు వాడనున్నారు. ఇప్పటికే ప్రత్యేక ట్రక్ లో పేలుడు పదార్థాలు తీసుకొచ్చి టవర్స్ లో ఫిక్స్ చేశారు. నోయిడాలో ట్విన్ టవర్లను వంద మీటర్ల ఎత్తుతో సూపర్ టెక్ సంస్థ నిర్మించింది. వీటి పక్కనే 50 మీటర్ల దూరంలోనే చాలా అపార్ట్ మెంట్లున్నాయి. మరోవైపు.. రోడ్డు, ఫ్లైఓవర్ కూడా ఉన్నాయి. పక్కనే ఉన్న అపార్ట్ మెంట్లకి ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపడుతున్నారు. చుట్టుపక్కల పార్కులన్నీ ప్లాస్టిక్ షీట్లతో కప్పేశారు. ట్విన్ టవర్ల సమీపంలోని హైవేపై మధ్యాహ్నం 2.15 నుంచి 2.45వరకు వాహనాల రాకపోకల్ని నిలిపివేయనున్నారు.

బ్రిటన్  నిపుణులు...
కూల్చివేతను పర్యవేక్షించడానికి బ్రిటన్  నుంచి నిపుణుల్ని రప్పించారు. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రతను ఏర్పాటుచేశారు. ఫైర్ సిబ్బందితో పాటు అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచారు. నిబంధనలు పాటించకుండా కట్టడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో ట్విన్ టవర్స్ కూల్చివేస్తున్నారు అధికారులు. ట్విన్ టవర్స్ ను ఎలా కూల్చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ రెండు భవనాలు వంద మీటర్ల ఎత్తున్నాయి. పక్కనే ఉన్న భవనాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా పని పూర్తి చేస్తామంటున్నారు. పక్కనే ఉన్న అపార్ట్ మెంట్లపై ఈ ప్రభావం పడకుండా భారీ కందకాలు తవ్వారు. శిథిలాలు అటువైపు వెళ్లినా కందకాల్లో పడి ఆగిపోతాయి.

శిథిలాలు అపార్ట్ మెంట్ల వైపు దూసుకెళ్లకుండా...
అలాగే శిథిలాలు అపార్ట్ మెంట్ల వైపు దూసుకెళ్లకుండా అదనపు భద్రత కోసం మధ్యలో భారీ కంటైనర్లు అడ్డుగా పెట్టారు. అనుకోని ఘటనలు జరిగితే ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ట్విన్  టవర్స్  సమీపంలోని ఎమరాల్డ్  కోర్టు, ఏటీఎస్  విలేజ్  సొసైటీస్  లో నివసిస్తున్న 5 వేల మందిని ఇప్పటికే ఖాళీ చేయించారు. వారికి చెందిన 12 వందల వాహనాలను కూడా అక్కడ్నుంచి తరలించారు. జంట భవనాలున్న ప్రాంతంలోకి ఈ రోజంతా ప్రజలు, వాహనాలను రానివ్వమని అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే చుట్టుపక్కల భవనాలకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా వాటి ఓనర్లు నష్టపోకుండా.. వంద కోట్ల బీమా కవరేజీ తీసుకుంది ఎడిఫస్  కంపెనీ. అపార్ట్ మెంట్లకు ఏదైనా డ్యామేజీ జరిగినా బీమా డబ్బుతో రిపేర్ చేసి ఇవ్వనుంది.

ఎడిఫిస్ ఇంజినీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో...
కూల్చే వేసే ప్రక్రియ మొత్తం ఎడిఫిస్ ఇంజినీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో జరగనుంది. దీనికోసం 46 మంది ఇంజనీర్లు రోజుకు 12 గంటలు పని చేస్తున్నారు. 300కు పైగా సీసీటీవీ కెమెరాలతో పనులను పర్యవేక్షిస్తున్నారు. రెండు భవనాల్లో 9 వేల 600 రంద్రాలు చేసి 3500 కేజీల పేలుడు పదార్థాలను ఫిక్స్ చేశారు. రెండు టవర్లలో డిటోనేటర్లకు పవర్ సప్లై కోసం 20 వేల కనెక్షన్లు ఇచ్చారు. 8 నుంచి 9 సెకన్లలో టవర్లు నేలకొరుగుతాయని ఇంజినీర్లు చెబుతున్నారు. కూలిన తర్వాత 25 వేల క్యూబిక్ మీటర్ల శిథిలాలు మిగులుతాయని అంచనా వేస్తున్నారు. వీటిని తొలగించేందుకు దాదాపు మూడు నెలలు పట్టొచ్చని అంటున్నారు. 

ఉన్నచోటే నిలువుగా కుప్పకూలిపోతాయి...
భవనాన్ని పేల్చి వేస్తే ఏదైనా ఒకవైపు ఒరిగిపోయే ప్రమాదం ఉంది. కానీ ఇక్కడ అలా జరగకుండా చర్యలు చేపట్టామని ఇంజినీరింగ్ నిపుణులు వెల్లడిస్తున్నారు. రెండు టవర్లు కూడా ఉన్నచోటే నిలువుగా కుప్పకూలిపోతాయని చెప్తున్నారు. పేలుడు సమయంలో ఒకేవైపు ఒరగిపోకుండా అన్ని వైపులా బ్లాస్టింగ్ ఒకేసారి జరుగుతుందంటున్నారు. పేలుడు ప్రభావం 50 మీటర్లవరకే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ట్విన్ టవర్స్ కూల్చడానికి కారణం నిబంధనలు పాటించకపోవడం. దీంతో ఈ ఇష్యూ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.

2009లో ఈ భారీ ప్రాజెక్టు...
నోయిడాలోని సెక్టార్  93 ప్రాంతంలో సూపర్ టెక్  లిమిటెడ్ కంపెనీ 2009లో ఈ భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఎమరాల్డ్  కోర్టు సమీపంలోని సెక్టార్ 93ఏలో ఎపెక్స్, సియాన్ ట్విన్ టవర్స్ ఉన్నాయి. ఎపెక్స్ ఎత్తు 102 మీటర్లు. దీన్ని 32 అంతస్తులతో నిర్మించారు. 95 మీటర్ల ఎత్తున్న సియాన్ లో 29 అంతస్తులున్నాయి. ఈ జంట భవనాల్లో 915 ఫ్లాట్లు, 21 వాణిజ్య సముదాయాలు, రెండు బేస్  మెంట్లున్నాయి. దీని నిర్మాణానికి మూడేళ్లు పట్టింది. నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం రెసిడెన్షియల్ కాంప్లెక్సుల మధ్య కనీసం 16 మీటర్ల దూరముండాలి. కానీ ఈ టవర్స్ మధ్య 9 మీటర్ల దూరం కూడా లేదు. ఈ భవనాల నిర్మాణానికి సంబంధించి రెసిడెంట్స్  వెల్ఫేర్ అసోసియేషన్ కు ప్లానింగ్ చూపాలన్న నిబంధనను బిల్డర్ పట్టించుకోలేదు.

నిబంధనల విషయంలో నిర్లక్ష్యం...
అధికారులు కూడా బిల్డర్ తో మిలాఖత్ అయ్యి నిబంధనల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలొచ్చాయి. నిబంధనలు పాటించకుండా ట్విన్ టవర్స్ కట్టడంతో నిర్మాణ సంస్థకు వ్యతిరేకంగా నలుగురు 2012లో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. నిర్మాణం అక్రమమేనని 2014లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ సుప్రీంకోర్టులోనూ కంపెనీకి ఎదురు దెబ్బ తగిలింది. జంట భవనాల్ని కూల్చేయాల్సిందేనని గతేడాది ఆగస్ట్ 31న కోర్టు ఆదేశాలిచ్చింది. వాస్తవానికి ఇప్పటికే కూల్చివేత ప్రక్రియ పూర్తికావాలి. కానీ టెక్నికల్ అంశాలు, వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ నెల 28కి వాయిదా పడింది.