టీ20 వరల్డ్ కప్: దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా గెలుపు

టీ20 వరల్డ్ కప్: దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా గెలుపు
  • చివరి ఓవర్ వరకు ఉత్కంఠ.. 5వికెట్ల తేడాతో ఆసీస్ విజయం 
  • దక్షిణాఫ్రికా స్కోర్: 20 ఓవర్లలో 118/9
  • ఆస్ట్రేలియా స్కోర్: 19.4 ఓవర్లలో 121/5  

దుబాయ్: టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి అయిన దక్షిణాఫ్రికాతో తలపడిన ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపింది. ఒత్తిడిని అధిగమించి ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. స్వల్ప టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి విజయం సాధించింది. 
ఆస్ట్రేలియా బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ (35), మ్యాక్స్ వెల్ (18), డేవిడ్ వార్నర్ (14), మార్ష్ (11) పరుగులు చేయగా.. అరోన్ ఫించ్ డకౌట్ అయ్యాడు. స్వల్ప టార్గెట్ ఛేదనలో ఆసీస్ తడబడింది. దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. అయితే మ్యాక్స్ వెల్ –స్మిత్ జోడీ వికెట్ల దగ్గర నిలదొక్కుకుని మెల్లగా పరుగులు రాబట్టారు. వీరి జోడీ 42 పరుగులు చేయడంతో ఆసీస్ గెలుపు తీరాలకు చేరుకుంది. ఈ పరిస్థితుల్లో వీరి జోడీ వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో ఆస్ట్రేలియా ఇబ్బందుల్లో పడింది. అయితే మార్కస్ స్టోయినిన్ (24 నాటౌట్), మ్యాథ్యూ వేడ్ (15నాటౌట్) దక్షిణాఫ్రికా బౌలర్ల ను దీటుగా ఎదుర్కొంటూ నిలదొక్కుకోవడంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో నార్జే 2 వికెట్లు, రబాడ, షంసి, మహరాజ్ చెరో వికెట్ పడగొట్టారు. 
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా జట్టును ఆస్ట్రేలియా బౌలర్లు చుక్కలు చూపించారు. చురకత్తుల్లాంటి బంతులతో బ్యాటర్లను చికాకు పెడుతూ వికెట్లు పడగొట్టారు. తక్కువ స్కోరుకే కీలక వికెట్లు కోల్పోవడంతో చిక్కుల్లో పడిన దక్షిణాఫ్రికాను మారక్రమ్ (40), రబాడ (19) ఆదుకున్నారు. పరుగులు తీయడానికి ఇబ్బందులు పడతూ ఆడిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో మిల్లర్ 16,క్లాసెన్ 13, బవుమా 12,డికాక్ 7, డస్సెన్ 2,నార్జే 2, ప్రిటోరియస్ 1 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, జంపా, హేఇల్ వుడ్ చెరి రెండు చొప్పున, కమిన్స్, మ్యాక్స్ వెల్ చెరో వికెట్ పడగొట్టారు.