అదిరే రీ ఎంట్రీ

అదిరే రీ ఎంట్రీ

అందరూ సాగే దారిలో వెళ్లకుండా తనకంటూ ఓ సెపరేట్ రూటు సృష్టించుకుంది టబు. అందుకే వచ్చిన సినిమాలన్నీ కాకుండా మనసుకు నచ్చిన వాటినే చేసుకుంటూ వచ్చింది. చేసిన ప్రతి సినిమాతో తన ముద్ర వేసింది. అలాంటి నటిని త్రివిక్రమ్‌‌ తన సినిమాకి తీసుకున్నాడంటే ఆసక్తి ఏర్పడకుండా ఉంటుందా! అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్‌‌ రూపొందిస్తున్న చిత్రంలో టబు ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఆమె సెట్​లో జాయినయ్యిందంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు టీమ్. క్యారెక్టర్ గురించి వివరాలేమీ చెప్పలేదు కానీ… ఆమె గెటప్‌‌ని బట్టి చూస్తే ‘అ ఆ’లో నదియా టైప్ పాత్రలా అనిపిస్తోంది. బహుశా హీరో తల్లి కానీ, హీరోయిన్‌‌ తల్లి కానీ అయ్యుంటుందనిపిస్తోంది.  నాటికీ నేటికీ ఆమెలో పెద్ద తేడా కనిపించడం లేదు. ఎంతో అందంగా ఉంది. ‘పాండురంగడు’ సినిమా తర్వాత ఆమె ఇంతవరకూ తెలుగులో నటించలేదు. అంటే టాలీవుడ్‌‌లో ఆమెకిది రీ ఎంట్రీ అనే చెప్పాలి. టబు లాంటి నటిని ఎంచుకున్నప్పుడే అంచనాలు పెరిగిపోతాయి. అలాంటిది ఆమె కోసం ప్రత్యేకంగా వీడియోని రిలీజ్ చేశారంటే ఆమె రోల్ ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోవచ్చు. ఏ పాత్రయినా దానికి తన నటనతో ఆమె మరింత ప్రత్యేకతను తీసుకు రావడం మాత్రం ఖాయం.