V6 News

1000 మందిని పీకేస్తున్న స్నాప్‌చాట్ కంపెనీ.. రిక్రూట్మెంట్స్ బంద్

1000 మందిని పీకేస్తున్న స్నాప్‌చాట్ కంపెనీ.. రిక్రూట్మెంట్స్ బంద్

టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ పరంపర ఇప్పట్లో ముగిసేలా కనిపించటం లేదు. అమెరికా సంస్థ ఒరాకిల్ బాటలోనే ఇప్పుడు పాపులర్ సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ మాతృసంస్థ 'స్నాప్ ఇంక్' కూడా భారీగా ఉద్యోగులను పీకేసేందుకు రెడీ అయ్యింది. 2026లో తమ ఖర్చులను తగ్గించుకోవడమే లక్ష్యంగా ఏకంగా 16 శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపాలని డిసైడ్ అయ్యింది. యాడ్స్ రెవెన్యూ తగ్గడం, ఇన్వెస్టర్ల నుంచి ఒత్తిడి పెరగడంతో స్నాప్ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. దాదాపు 1,000 మంది ఉద్యోగులపై ఈ లేఆఫ్స్ ప్రభావం పడనుంది.

డిసెంబర్ 2025 నాటికి స్నాప్ కంపెనీలో సుమారు 5వేల 261 మంది ఫుల్ టైం ఉద్యోగులు ఉండగా.. తాజా నిర్ణయంతో కేవలం ఉద్యోగుల తొలగింపు మాత్రమే కాకుండా.. ఖాళీగా ఉన్న మరో 300 ఓపెన్ రోల్స్‌ను కూడా రద్దు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. దీంతో ఏడాదికి దాదాపు 500 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ.4వేల 100 కోట్లను ఆదా చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అడ్వర్టైజర్లు మెటా , గూగుల్ వంటి పెద్ద ప్లాట్‌ఫారమ్‌ల వైపు మొగ్గు చూపుతుండటంతో స్నాప్ వంటి చిన్న సంస్థలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తేలింది.

ఈ లేఆఫ్స్ అనేవి ప్రధానంగా ఏఆర్ (Augmented Reality) విభాగం కాకుండా మిగిలిన టీమ్స్‌పైనే ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. స్నాప్ భవిష్యత్తును ఏఆర్ టెక్నాలజీలోనే చూస్తోంది కాబట్టి.. ఆ డిపార్ట్మెంట్ లోని కీలక ప్రాజెక్టులను మాత్రం కంపెనీ కాపాడుకుంటోంది. ముఖ్యంగా 'స్పెక్స్'(AR స్మార్ట్ గ్లాసెస్).. 'లెన్స్ స్టూడియో' వంటి విభాగాల్లో నియామకాలు కొనసాగుతూనే ఉంటాయని తెలుస్తోంది. సాంప్రదాయ ప్రకటనలపైనే ఆధారపడకుండా.. భవిష్యత్తులో స్థిరమైన ఆదాయం కోసం ఈ ఏఆర్ విభాగంపై స్నాప్ గత 11 ఏళ్లలో దాదాపు 3 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది. మన కరెన్సీలో రూ.27వేల కోట్లకు ఆ ఇన్వెస్ట్మెంట్ సమానం. 

ప్రస్తుతం టెక్ రంగంలో కొనసాగుతున్న ఏఐ ట్రెండ్ కూడా ఈ లేఆఫ్స్‌కు ఒక కారణంగా మారుతోంది. కంపెనీలు తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి మానవ వనరుల కంటే ఏఐపైనే ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. అమెజాన్, మెటా, సేల్స్‌ఫోర్స్ వంటి దిగ్గజాల జాబితాలో ఇప్పుడు స్నాప్ కూడా చేరిపోయింది. సీఈఓ ఇవాన్ స్పీగెల్ గతంలోనే చెప్పినట్లుగా.. కంపెనీ ఇప్పుడు ఒక క్లిష్ట దశలో ఉంది. మరి ఈ లేఆఫ్స్ తర్వాత స్నాప్ మళ్లీ తన పూర్వవైభవాన్ని అందుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.