నిందితుడిని కఠినంగా శిక్షించాలి: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ

నిందితుడిని కఠినంగా శిక్షించాలి: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్  విజయ సజీవదహనం సంఘటనను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్‌ కారం రవీందర్‌ రెడ్డి,  సెక్రటరీ జనరల్ మమత ఈ ఘటనపై ప్రెస్ నోట్ విడుదల చేశారు. ప్రజలకు రక్షణ కల్పించే ఒక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పై ఇలాంటి సంఘటన జరగటం దురదృష్టకరమని,  ప్రజలను ఆపద సమయంలో ఆదుకునే అధికారి పై ఇలాంటి దాడి జరగడం అమానుషమన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించి ప్రభుత్వ అధికారులకు , ఉద్యోగులకు తగిన రక్షణ కల్పించాలని కోరారు.

వివాదం ఒక సాకు గా చూపించి నిందితుడు హత్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని అన్నారు. విజయ మంచి అధికారిగా పేరుతెచ్చుకున్నారని, గత మూడు సంవత్సరాలలో ఎలాంటి అవినీతికి  పాల్పడకుండా,  అభియోగాలకు తావివ్వకుండా పని చేస్తున్నారని వారు తెలిపారు.

నిందితుడు తప్పుడు పనులు చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చి, అలాంటి పనులు చేయనందువల్లే పెట్రోల్ పోసి నిప్పంటించాడని, ఈ ఘటన ఉద్యోగులను ఆందోళనకు గురి చేసిందని అన్నారు. నిందితుడు ఒక్కడే వలనే ఇది సాధ్యం కాదని, దీని వెనక ఉన్న వ్యక్తులను కూడా గుర్తించి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు.

ప్రభుత్వపరంగా విధులు నిర్వహించే అధికారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని,  ప్రత్యేకంగా మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. తహశీల్దార్ విజయ కుటుంబ సభ్యులకు తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ గెజిటెడ్ అధికారుల, పెన్షనర్ల మరియు కార్మికుల ఐక్యత కార్యాచరణ సమితి ప్రగాఢ సానుభూతి తెలుపుతుందని అన్నారు. ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నామని తెలిపారు.

Telangana employees JAC strongly condemns incident of Tahsildar murder