పోతిరెడ్డిపాడును అడ్డుకోండి..కృష్ణాబోర్డుకు తెలంగాణ ఫిర్యాదు

పోతిరెడ్డిపాడును అడ్డుకోండి..కృష్ణాబోర్డుకు తెలంగాణ ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం నుంచి నీటిని అక్రమంగా తరలించేందుకు ఏపీ చేపడుతున్న లిఫ్ట్ స్కీం, పోతిరెడ్డిపాడు విస్తరణలను అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్ కుమార్ కృష్ణాబోర్డు చైర్మన్ కు మంగళవారం లేఖ రాశారు. ఏపీ సర్కారు రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఏ కొత్త ప్రాజెక్టునూ చేపట్టవద్దన్న నిబంధనను తుంగలో తొక్కుతున్నారని అందులో పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విత్ డ్రా కెపాసిటీని రోజుకు 8 టీఎంసీలకు పెంచడానికి ఏపీ సర్కారు అనుమతులు ఇచ్చిందని తెలిపారు. శ్రీశైలం రెండు రాష్ట్రాల కామన్ ప్రాజెక్టు అని, నిర్ణయం తీసుకునే ముందు తెలంగాణకు కనీసం సమాచారం ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇది తెలంగాణ ప్రజల హక్కులను కాలరాయడమేనన్నారు.

బేసిన్ అవతలికి తరలిస్తున్నరు

ఏపీ ఇష్టారాజ్యంగా కృష్ణా నీటిని బేసిన్ అవతలి అవసరాల కోసం తరలిస్తోందని ఇరిగేషన్  ప్రిన్సిపల్  సెక్రెటరీ లేఖలో స్పష్టం చేశారు. రూల్స్  ప్రకారం ఎక్కువ పరీవాహక ప్రాంతం ఉన్న తెలంగాణకే ఎక్కువ నీటి కేటాయింపులు దక్కే ఆస్కారం ఉందని.. ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల్లో తెలంగాణకే 575 టీఎంసీలు దక్కే చాన్స్  ఉందని వివరించారు. అయినా ఏపీ అక్రమ ప్రాజెక్టులతో శ్రీశైలం నీటిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. సంగమేశ్వరం వద్ద చేపట్టే రాయలసీమ లిఫ్ట్ స్కీం, పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు ప్రాజెక్టులు బేసిన్ అవతలికి కృష్ణా నీటిని తరలించడానికి చేపట్టినవేనని స్పష్టం చేశారు. ఏపీ చేపడుతున్న కొత్త ప్రాజెక్టుల పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా ఆ రాష్ట్రాన్ని ఆదేశించాలని కోరారు. హైదరాబాద్ తాగునీరు, మిషన్ భగీరథ అవసరాలతోపాటు ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల తాగు, సాగునీటి అవసరాలకు శ్రీశైలం రిజర్వాయరే కీలకమని తెలిపారు. నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్, ఏఎమ్మార్ ఎల్బీసీ, కల్వకుర్తి, డిండి, పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, శ్రీశైలం ఎడమగట్టు పవర్ స్టేషన్లో విద్యుత్ ఉత్పాదనపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు.

లెక్కలు కూడా సరిగా చెప్పరు

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తరలిస్తున్న నీటికి ఏపీ సరైన లెక్కలు చెప్పడం లేదని రజత్ కుమార్  లేఖలో వివరించారు. ఇష్టారాజ్యంగా నీళ్లను తరలించుకుంటోందని చెప్పారు. అక్కడ టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించినా.. ఇంతవరకూ ఏర్పాటు చేయలేదని గుర్తుచేశారు. వాస్తవానికి పోతిరెడ్డిపాడు నుంచి 11,150 క్యూసెక్కుల నీటిని మాత్రమే తరలించే అనుమతి ఉన్నా.. ఇప్పటికే అక్రమంతా కెపాసిటీని 44 వేల క్యూసెక్కులకు పెంచిందని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశాన్ని గతంలోనే కృష్ణా బోర్డు దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలిపారు. డీటైల్డ్ రిపోర్టులు ఇవ్వాలని ఇదివరకే ఏపీని ఆదేశించినట్టుగా గుర్తు చేశారు.

మా నీటిని మేం వాడుకుంటాం:జగన్