రాష్ట్రంలో పోలింగ్​ 65%

రాష్ట్రంలో పోలింగ్​ 65%
  • 2019 లోక్​సభ ఎన్నికలతో పోలిస్తే దాదాపు సమానం
  • పల్లెల్లో బారులు తీరిన ఓటర్లు..పట్నాల్లో అంతంత మాత్రమే
  • అత్యధికంగా భువనగిరిలో 76.47%.. అత్యల్పంగా హైదరాబాద్​లో​ 46.08%
  • 10 ఎంపీ సీట్లలో 70% దాటిన పోలింగ్
  • వచ్చే నెల 4న ఫలితాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్న చిన్న ఘటనలు తప్ప సజావుగా సాగింది. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్​ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు అవకాశం ఉండగా.. 6 గంటలలోపు క్యూలైన్​లో ఉన్నవాళ్లకు మరికొంత టైమ్​ను ఎన్నికల కమిషన్​ కేటాయించింది. సోమవారం రాత్రి ఈవీఎంలను భద్రంగా స్ట్రాంగ్​ రూమ్​లకు చేర్చారు.

అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొన్ని స్ట్రాంగ్​ రూంలకు పొలిటికల్​ పార్టీల ఏజెంట్ల సమక్షంలో సీల్​ చేశారు. జూన్​ 4న ఓట్లను లెక్కించనున్నారు. రాష్ట్రంలో సోమవారం రాత్రి వరకు దాదాపు 65 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. 

ఓటింగ్ సమయం (సాయంత్రం 6 గంటలు) ముగిసే కంటే ముందు పోలింగ్​ కేంద్రాల్లోకి వచ్చి క్యూ లైన్​లో ఉన్న వాళ్లకు ఓటేసే అవకాశం ఇవ్వడంతో పలు కేంద్రాల్లో రాత్రి 7 గంటల దాటిన తర్వాత   కూడా పోలింగ్​ కొనసాగింది. 

గత ఎన్నికలతో పోలిస్తే..

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఎండలు ఎక్కువగా లేకపోవడం.. పలుచోట్ల వాతావరణం మబ్బులు పట్టి ఉండటంతో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగలేదు. వాస్తవానికి 5 గంటల వరకు ఉన్న పోలింగ్​ సమయాన్ని ఎండల కారణంగా మరో గంట పొడిగించాలన్న విజ్ఞప్తుల మేరకు సాయంత్రం 6 గంటల వరకు ఈసీ ఇటీవల పొడిగించిన విషయం తెలిసిందే. వాతావరణం కూల్​గా ఉండటంతో ఓటర్లు ముఖ్యంగా పల్లెల్లో క్యూ కట్టారు.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 64.93శాతం ఓటింగ్​ నమోదైనట్లు రాత్రి 12 గంటలకు  ఈసీ తెలిపింది. 2019లో రాష్ట్రంలో లోక్​సభ  ఎన్నికల్లో 64.29 శాతం పోలింగ్​ నమోదు కాగా.. ఇప్పుడు 0.64  శాతం పెరిగింది. ఇక డిసెంబర్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 71.34  శాతం ఓటింగ్​ నమోదు కాగా.. దాంతో పోలిస్తే 6.41 శాతం మేర తగ్గింది.  

ఫస్ట్​ భువనగిరి.. లాస్ట్ హైదరాబాద్​

ఈసారి అత్యధికంగా  భువనగిరి లోక్​సభ సెగ్మెంట్​లో 76.47 శాతం పోలింగ్​ రికార్డయింది. అత్యల్పంగా హైదరాబాద్​ లోక్​సభ సెగ్మెంట్​లో 46.08 శాతం ఓట్లు పడ్డాయి. ఎప్పటి లాగే పల్లెల్లో ఓటర్లు బారులు తీరారు. పట్టణ ప్రాంతాల్లోనే ఓటింగ్​ తగ్గింది.  హైదరాబాద్‌‌, మేడ్చల్​, మల్కాజ్​గిరి, సికింద్రాబాద్​ లోక్​సభ సెగ్మెంట్ల పరిధిలో ఓటు వేసేందుకు జనం అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఓటింగ్​ తగ్గింది. 

తొలి రెండు గంటల్లో 9.51 శాతం

ఉదయం 6.30 గంటల కల్లా పోలింగ్​ అధికారులు మాక్​ పోలింగ్​ నిర్వహించి.. రియల్​ పోలింగ్​కు  సిద్ధమయ్యారు. పోలింగ్‌‌ ప్రారంభంలో కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించగా అధికారులు సరిచేశారు. అనంతరం ఓటింగ్‌‌ ప్రశాంతంగా సాగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్​ ప్రారంభం కాగా.. ఉదయం 9 గంటల వరకు 9.51 శాతం రికార్డయింది. ఆ తర్వాత ఓటర్లు ఎక్కువ మంది ఓటు వేసేందుకు రాగా ఉదయం 11 గంటల వరకు 24.31 శాతం నమోదైంది. పదకొండు గంటల తర్వాత ఓటింగ్​ కాస్త పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.38 శాతం, 3 గంటల వరకు 52.34 శాతం పోలింగ్​ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది.  

13 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 గంటలకే క్లోజ్​

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 5 లోక్​సభ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగతా 106 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 6 వరకు టైం ఇచ్చారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌‌ ముగించారు.  

17 సెగ్మెంట్లు.. 525 మంది అభ్యర్థులు

రాష్ట్రంలోని 17 లోక్‌‌సభ నియోజకవర్గాల్లో 525 అభ్యర్థులు బరిలో నిలవగా వారిలో 50 మంది మహిళలు ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో 68 మంది జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు కాగా.. 285 మంది స్వతంత్రులు. అధికంగా సికింద్రాబాద్ లోక్​సభ సెగ్మెంట్​లో 45 మంది పోటీలో ఉండగా తక్కువగా ఆదిలాబాద్‌‌లో 12 మంది బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే  21,690 మంది (వివిధ సర్వీసుల వాళ్లు, ప్రత్యేక కేటగిరీల వాళ్లు) ఇంటి వద్దే ఓటుహక్కు వినియోగించుకున్నారు.

సోమవారం 35,809 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 80 ఏండ్లు పైబడిన వాళ్లకు ఉచితంగా రవాణా సదుపాయం కల్పించారు. అంధుల కోసం బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు ముద్రించారు. ఓటింగ్ శాతం పెంచేందుకు మోడల్ పోలింగ్‌‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు.  ఎన్నికల విధులు, పోలీసు బందోబస్తులో దాదాపు 3 లక్షల మందికిపైగానే  సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో దాదాపు 10 వేల  సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన అధికారులు.. ఆ కేంద్రాల్లోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు.  

38 కేసులు నమోదు: సీఈవో

పోలింగ్ వేళ వివిధ కారణాలతో 38 కేసులు నమోదు చేశామని సీఈవో వికాస్ రాజ్  చెప్పారు. రాష్ట్రంలో పోలింగ్ శాతం బాగానే నమోదైందని ఆయన మీడియాతో అన్నారు. తుది ఓటింగ్ శాతం ఎంత అనేది  వెల్లడిస్తామని తెలిపారు. జీపీఎస్ ఉన్న వాహనాల్లో ఈవీఎంలు తరలించామని.. స్ట్రాంగ్​ రూమ్స్​లో ఈవీఎంలు భద్రపరిచి సీల్​ వేసే ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగిందని చెప్పారు. 

స్ట్రాంగ్​ రూమ్​లలో భద్రంగా ఈవీఎంలు

పోలింగ్ ముగిసిన తర్వాత అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలు, వీవీప్యాట్లకు అధికారులు సీల్​ వేశారు. వాటిని స్ట్రాంగ్​ రూమ్​లకు తరలించారు. ఈ ప్రక్రియ మొత్తం వీడియోలో రికార్డ్ చేశారు. ఇక్కడ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్​ రూమ్​ల వద్ద  24 గంటలూ జూన్​ 4వ తేదీ దాకా పోలీసులు కాపలా కాయనున్నారు. జూన్​ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

రాత్రి 11 గంటల వరకు ఎలక్షన్​ అధికారులు అందించిన సమాచారం మేరకు పార్లమెంట్​ నియోజకవర్గాల వారీగా పోలింగ్​ పర్సంటేజీ ఇలా

  • ఆదిలాబాద్‌    72.96
  • భువనగిరి    76.47
  • చేవెళ్ల    55.45
  • హైదరాబాద్    46.08
  • కరీంనగర్‌    72.33
  • ఖమ్మం    75.19
  • మహబూబాబాద్‌    70.68
  • మహబూబ్‌నగర్‌    71.54
  • మల్కాజ్​గిరి    50.12
  • మెదక్​    74.38
  • నాగర్​కర్నూల్‌    68.86
  • నల్గొండ    73.78
  • నిజామాబాద్‌    71.50
  • పెద్దపల్లి    67.88
  • సికింద్రాబాద్​    48.11
  • వరంగల్‌    68.29
  • జహీరాబాద్​​    74.54