వామ్మో.. చిరుత!.. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో వరుసగా చిరుతపులి దాడులు

వామ్మో.. చిరుత!.. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో వరుసగా చిరుతపులి  దాడులు
  • వారం రోజుల్లో  మూడు పశువులపై దాడి
  • భయాందోళనలో స్థానికులు 
  • పులిని పట్టుకునేందుకు ఫారెస్టు ఆఫీసర్ల ప్రయత్నాలు 

లింగంపేట, వెలుగు :  కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో  వరుసగా జరుగుతున్న చిరుతపులి దాడులు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే  చిరుత మూడు పశువులను చంపేయడం జిల్లాలో కలకలం రేపుతోంది. లింగంపేట మండలంలోని మోతె, గాంధీనగర్, బూరుగిద్ద, తాడ్వాయి  మండలంలోని ఎర్రపహాడ్​గ్రామాల ప్రజలు ఎప్పుడు, ఏం జరుగుతుందోనని బిక్కబిక్కుమంటూ గడుపుతున్నారు. చిరుత భయంతో రైతులు, కూలీలు వ్యవసాయ పొలాలకు వెళ్లడమే మానేస్తున్నారు. 

వారంలో మూడు ఘటనలు... 

 ఈనెల 15న ఎర్రపహాడ్​ గ్రామ శివారులో  సంగయ్య​అనే రైతు పొలం వద్ద కట్టేసి ఉంచిన దూడను పులి హతమార్చింది. 
 శుక్రవారం రాత్రి మోతె గ్రామానికి చెందిన మల్లేశ్​ అనే రైతు పొలం వద్ద కట్టేసి ఉన్న లేగదూడను చంపేసింది. 
 శనివారం సాయంత్రం ఎర్రపహాడ్ శివారులో మల్లయ్య అనే వ్యక్తికి సంబంధించిన గొర్రెను  వేటాడింది. ఆదివారం ఉదయం బోడగుట్ట ప్రాంతంలో  మల్లయ్య గొర్రెలను మేపుతుండగా చిరుత దాడిలో మృతిచెందిన గొర్రె  ఆనవాళ్లు కన్పించింది. 

గతంలోనూ కొన్ని ఘటనలు... 

 సెప్టెంబర్ 15న లింగంపేట మండలం నల్లమడుగు అటవీ ప్రాంతంలో దూప్ సింగ్ అనే రైతుకు చెందిన రెండు లేగ దూడలను చిరుత చంపేసింది. 
అక్టోబర్ 12న మండలంలోని కంచు మల్ గ్రామ సమీపంలో భవానిపేట సీతయ్య పల్లి ప్రధాన రోడ్డుపై చిరుతపులి వాహనదారులకు కనిపించడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
 నవంబర్ 30న  ఈనెల 4న మింగారం గ్రామ శివారులో కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రోడ్డుపై చిరుత కనిపించడంతో వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాకపోకలు కొనసాగిస్తున్నారు.

చిరుత బారి నుంచి కాపాడాలి

అటవీ శాఖ అధికారులు బోను ఏర్పాటు చేసి చిరుతను బంధించాలి. శుక్రవారం రాత్రి పొలం వద్ద కట్టేసి ఉన్న మా లేగదూడను చిరుత పులి చంపేసింది. ఈ వారం రోజుల్లోనే ఇతర రైతులకు సంబంధించిన రెండు పశువులపై కూడా చిరుత దాడి చేసింది. నాలుగు నెలలుగా  చిరుత పులి  మండలంలో తిరుగుతున్నా ఫారెస్ట్ అధికారులు  పట్టించుకోవడం లేదు. - మల్లేశ్, రైతు, మోతే గ్రామం బోను ఏర్పాటు చేస్తాం

 ఎర్రపహాడ్​ సెక్షన్ పరిధిలోని మోతే, గాంధీనగర్, బూరుగిద్ద, ఎల్లారం గ్రామాల శివారుల్లో చిరుత సంచరిస్తోంది. ప్రజలు అలర్ట్​గా ఉండాలి. వాహనదారులు రాత్రి వేళల్లో ఈ రూట్​లో జాగ్రత్తగా వెళ్లాలి. చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తాం. - వినోద్ కుమార్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఎర్రపహాడ్