హైదరాబాద్‌‌‌‌లో క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి కృషి చేస్త: మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ

హైదరాబాద్‌‌‌‌లో క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి కృషి చేస్త: మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ

పద్మారావునగర్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లో క్రిస్టియన్  భవన్ నిర్మాణానికి కృషి చేస్తానని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి క్రిస్టియన్  భవన్  నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి పొందేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. వివాదాలులేని అనుకూలమైన ప్రదేశాన్ని గుర్తించి అక్కడ క్రిస్టియన్ భవన్ నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటానన్నారు.

క్రైస్తవ సమాజానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌‌‌‌లోని మెట్టుగూడలో గ్లోబల్ క్రిస్టియన్  లా బోర్డ్  కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించి, మాట్లాడారు. గ్లోబల్  క్రిస్టియన్  లా బోర్డ్  స్థాపన ఒక మంచి పరిణామమని తెలిపారు.

క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేందుకు ఈ బోర్డు సమర్థవంతంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పేద క్రైస్తవులకు సేవ చేసేందుకు ఈ బోర్డును ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి అన్నారు. ముఖ్యంగా క్రైస్తవులకు న్యాయపరంగా అవసరమైన సహాయం అందించేందుకు ఈ లా బోర్డ్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. క్రైస్తవ మైనారిటీ సంక్షేమంలో మహిళల అభివృద్ధి కూడా ఎంతో ముఖ్యమన్నారు. క్రైస్తవ మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.