- భూపాలపల్లి జిల్లాలో 17 మిల్లుల్లో 14185 టన్నుల బకాయిలు
- ఆరు మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టిన ఆఫీసర్లు
- ఈ సీజన్ లో ధాన్యం కేటాయింపు నిలిపివేత
జయశంకర్భూపాలపల్లి, వెలుగు: మిల్లర్లు తీసుకున్న ధాన్యం సీఎంఆర్ పెట్టకుండా మాయ చేస్తున్నారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కేసులు పెట్టినా స్పందించడం లేదు. మిల్లర్ల దందాకు అధికారులు వంత పాడుతుండడంతోనే బకాయిలు కోట్లలో పేరుకుపోతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాలో 17 మిల్లుల్లో 14,185 టన్నుల సీఎంఆర్ బకాయిలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఉన్నతాధికారులు 2022_23 లో టెండర్ ధాన్యం బకాయిలు ఉన్న ఆరు మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టి ఈ సీజన్లో ధాన్యం కేటాయింపు నిలిపి వేశారు.
ధాన్యం కేటాయింపు లేదు..
రెండేండ్లుగా టెండర్ ధాన్యం బకాయిలు ఉన్న మిల్లర్లను ఈ ఏడాది సివిల్ సప్లై ఆఫీసర్లు బ్లాక్ లిస్టులో పెట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 17 మిల్లులో 14,185 టన్నుల టెండర్ ధాన్యం బకాయిలు ఉన్నాయి. ఆరు మిల్లుల నుంచి సుమారు రూ.3 కోట్ల వరకు బకాయిలు ఉండడంతో సివిల్ సప్లై ఆఫీసర్లు బ్లాక్ లిస్టులో పెట్టారు. ఇందులో మూడు బాయిల్డ్ రైస్ మిల్లులు, మూడు రా రైస్ మిల్లులు ఉన్నాయి. కొండపేట వెంకటేశ్వర రైస్ మిల్, కాటారం అన్నపూర్ణ రైస్ మిల్, గొర్లవీడు వెంకటేశ్వర అగ్రో ఏజెన్సీస్, పెద్దాపూర్ అమ్మ రైస్ మిల్, చెల్పూర్ హరి హర రైస్ మిల్, టేకుమట్ల వాగ్దేవి రైస్ మిల్లుల నుంచి సుమారు 500 టన్నుల టెండర్ ధాన్యం బకాయిలుండగా, ఆ ధాన్యం విలువ రూ.3కోట్లుగా నిర్ధారించారు.
ఈ మిల్లులకు ఈ వానకాలం సీజన్ కు ధాన్యం కేటాయింపు నిలిపివేశారు. కాగా, ఇప్పుడు ఆ మిల్లర్లు ఎలాగైనా తమకు ధాన్యం కేటాయించాలని కలెక్టరేట్ లోని ఓ ఆఫీసర్ చుట్టూ తిరుగుతూ లాబీయింగ్ చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
కెపాసిటీకి మించి ధాన్యం దిగుమతులు
ప్రభుత్వం ఇచ్చే ధాన్యంతో వ్యాపారంలో రాటు తేలిన మిల్లర్లు మొదట్లోనే సర్దుకుంటున్నారు. తమ మిల్లింగ్ కెపాసిటీ స్థాయిని మించి ధాన్యాన్ని ముందుగానే దిగుమతి చేసుకుంటున్నారు. దీని కోసం ఆఫీసర్లతో లాబీ చేస్తున్నట్లుగా పలువురు మిల్లర్లు చెబుతున్నారు. అధికారులు సైతం మిల్లర్లతో కుమ్మక్కై దందాకు తెర లేపుతున్నట్లు విమర్శలు వినిస్తున్నాయి.
మిల్లుల్లో ధాన్యం నిల్వలపై నిరంతరం టాస్క్ఫోర్స్టీంలు తనిఖీలు చేస్తున్నా మిల్లర్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే ఈ సీజన్లో రైతుల నుంచి తక్కువకు వడ్లను కొనుగోలు చేసి మిల్లుల్లో దిగుమతి చేస్తున్నారు. క్వింటాకు రూ.1800 నుంచి రూ.2000 వరకు కొనుగోలు చేసి సీఎంఆర్ ధాన్యంగా చూపించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
10 శాతం గ్యారంటీతో ధాన్యం..
2022 నుంచి జిల్లా పరిధిలో సీఎంఆర్ పెట్టకుండా ముగ్గురు మిల్లర్లు మొండికేశారు. ప్రధానంగా రేగొండ మండలంలోని దుర్గా భవాని, కాటారం త్రీయార్స్, మొగుళ్లపల్లి లోని అన్నపూర్ణ మిల్లుల నుంచి రూ.12.76 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇలాంటి మిల్లర్ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు సివిల్ సప్లై ఆఫీసర్లు 10శాతం గ్యారెంటీతోనే ఈ సీజన్ ధాన్యం కేటాయింపులు చేపట్టారు. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 28 మిల్లులకు ధాన్యాన్ని కేటాయించేందుకు అనుమతులు ఇచ్చారు. మిల్లర్ల 10శాతం గ్యారంటీతో రూ.5 కోట్ల డిపాజిట్ అయ్యాయని అధికారులు తెలిపారు.
